TSRTC Shramik T Rajappa suicide: వికారాబాద్‌ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. సిబ్బంది రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం అన్నారు. టీఎస్ ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.


అనారోగ్యం కారణంగా డ్రైవర్ నుంచి శ్రామిక్‌గా.. 
2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప ఈ క్రమంలో ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్‌ అయ్యారని సజ్జనార్ తెలిపారు. 2018 నుంచి రాజప్ప శ్రామిక్‌ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజప్ప 12 రోజులు విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా డిపో యాజమాన్యం ఆయనకు డ్యూటీని కేటాయించారు. గత మూడు రోజులు నుంచి సైతం ఆయన విధులకు హాజరుకావడం కాలేదని సజ్జనార్ వెల్లడించారు.


వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలోని తన స్వగ్రామం దౌలపూర్‌లో సోమవారం రాత్రి రాజప్ప ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిందన్నారు సజ్జనార్. రాజప్ప ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. రాజప్ప మృతికి టీఎస్ ఆర్టీసీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. రాజప్ప ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోందని చెప్పారు. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానికి సంస్థ అధికారులు బాధ్యులని ఆరోపించడం సరైంది కాదన్నారు. రాజప్ప ఆత్మహత్య ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే శ్రామిక్ రాజప్ప ఆత్మహత్య చేసుకున్నారని వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి అని సజ్జనార్ స్పష్టం చేశారు.


ప్రజల కోసం ఎంతో అంకిత భావంతో సేవ చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. సిబ్బందిపై దాడి జరిగితే బాధ్యులకు రెండేళ్లు జైలుశిక్షతో పాటు జరిమానా సైతం విధిస్తామని సజ్జనార్ ఇటీవల హెచ్చరించారు. పోలీసుల సహకారం తీసుకుని ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.