Anganwadi Age Limit in Telangana: తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి పదవీ విరమణ వయసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక లేదా మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలని పేర్కొంది.
పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అలాగే సర్విసులో ఉన్న అంగన్‌వాడీ టీచర్ మరణిస్తే రూ.20 వేలు, మినీ అంగన్‌వాడీ టీచర్/హెల్పర్‌కు రూ.10 వేలు దహన సంస్కారాల నిమిత్తం అందజేయనున్నారు. పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయిని పెంచిన సంగతి తెలిసిందే. ఈ మినీ అంగన్‌వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చారు.
గత ప్రభుత్వ నిర్ణయమే..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అంగన్‌వాడీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంగన్‌వాడీ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వారికి మూడుసార్లు వేతనాలను పెంచింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచారు. పదవీ విరమణ సమయంలో ప్రత్యేక ఆర్థికసాయం కింద అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు సాయంగా అందించనున్నారు. 50 సంవత్సరాలలోపు వయసున్న వారికి రూ.2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తుంది ప్రభుత్వం. 50 సంవత్సరాలు దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ టీచర్లు రూ.7,800లు, హెల్పర్లు రూ.7,800 వేతనంగా ఇస్తున్నారు.
త్వరలో తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీ..
తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi Centers) టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
అంగన్‌వాడీలోని టీచర్లు, ఆయాల పోస్టులకు 7, 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తోపాటు, ఒక హెల్పర్ కూడా ఉంటారు. ఇప్పటికే పనిచేస్తున్నవారికి పదోన్నతులు రావడం, చాలామంది రిటైర్‌మెంట్ అయిపోవడం వంటి వాటితో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్ పోస్టుల్లోనూ 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.