Hari Hara Veera Mallu Teaser Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ  టీజర్ విడుదల తేదీ ఎప్పుడో చెప్పేశారు. మే 2న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ను విడుదల చేశారు. “సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీజర్ మే 2న ఉదయం 9.00 గంటలకు విడుదల అవుతుంది” అని తెలిపారు.  ‘ధర్మం కోసం యుద్ధం’ అనే డైలాగుతో ఈటెలు విసురుతున్న పోస్టర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.






మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏయం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.   


ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ గ్లింప్స్ విడుదల


ఇక ఇప్పటికే పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలకు సంబందించిన గ్లింప్స్ అభిమానులను బాగా అలరించారు. ఆయా సినిమాలపై ఓ రేంజిలో అంచనాలు పెంచాయి. ‘హరి హర వీరమల్లు’ గ్లింప్స్ కూడా ఇప్పటికే విడుదల అయ్యింది. అయినప్పటికీ, అభిమానులను అంతగా అలరించలేకపోయింది. టీజర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.



17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్న‘హరి హర వీరమల్లు’  


ఇక ఈ సినిమా 17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మొఘల్, కుతుబ్ షాహీల నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కథ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎవరూ టచ్ చేయని కథతో రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు ఎప్పుడూ లేని సరికొత్త అనుభూతిని పొందుతారని వెల్లడించారు. చిత్ర నిర్మాణం విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘హరి హర వీరమల్లు’ సినిమాకు జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.  ఏ దయాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.