హైదరాబాద్ చుట్టూ నిర్మితం కానున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను కేంద్ర ప్రభుత్వం రెండు భాగాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. ఉత్తర భాగం, దక్షిణ భాగంగా రోడ్డును విభజించి ఆ ప్రకారమే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం ఉత్తర భాగం ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భాగం నిర్మాణం మాత్రం మరింత ఆలస్యం కానుంది. ఈ భాగంపై వాహన రాకపోకల అంచనాలను మరోసారి అంచనా వేసి ఆ ప్రకారం అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దశలు ఇవీ..
* ఉత్తర భాగం, దక్షిణ భాగంగా విభజిస్తూ ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
* రీజినల్ రింగ్ రోడ్డు మొత్తం ఉత్తర భాగం పొడవు 158.465 కిలో మీటర్లు. ఈ భాగం కోసం 4 వేల ఎకరాల భూమి సేకరించాలి. ఈ భాగం అంచనా వ్యయం రూ.7,512 కోట్లు.
ఈ ప్రాంతాల గుండా ఉత్తర భాగం ఆర్ఆర్ఆర్
* సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు
* మెదక్ జిల్లాలో నర్సాపూర్, శివంపేట, తూప్రాన్
* సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్
* యాదాద్రి జిల్లాలో తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్
ఈ మండలాల పరిధిలో దాదాపు 80 నుంచి 100 గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్లనుంది. దీనికి సంబంధించి భూసేకరణ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే లేఖ రాసింది. ఈ ఉత్తర భాగానికి కన్సల్టెన్సీ బాధ్యతలను కే అండ్ జే కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చూస్తోంది. అలైన్‌మెంట్‌లో భాగంగా ఆయా గ్రామాల పేర్లను గుర్తించి కేంద్రానికి పంపారు. మరో నెల రోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ భాగం నిర్మాణం కోసం రూ.7,512 కోట్ల నిర్మాణ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 4 వేల ఎకరాల భూమిని సమీకరించనుండగా.. భూసేకరణకే దాదాపు రూ.1,800 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయి. రోడ్డు నిర్మాణ వ్యయం మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
దక్షిణ భాగం మరింత ఆలస్యం
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పొడవు 181 కిలో మీటర్లు. ఇది చౌటుప్పల్, షాద్ నగర్, కంది సంగారెడ్డి మీదుగా వెళ్తుంది. దక్షిణ భాగానికి గతంలో ట్రాఫిక్ అధ్యయనం చేయగా.. గంటకు ఐదారు వేల వాహనాలు రాకపోకలు ఉంటాయని గుర్తించారు. ఇంత తక్కువ ట్రాఫిక్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం లాభదాయం కాదని గుర్తించారు. అందుకే దక్షిణ భాగానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ట్రాఫిక్ అధ్యయనం చేయాలని రహదారుల సంస్థ నిర్ణయించింది.
ఉత్తర భాగంలో మాత్రం ట్రాఫిక్ గంటకు 18,918 వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా వేశారు. రెండు సార్లు ట్రాఫిక్ అధ్యయనం చేసిన అనంతరం దీన్ని తేల్చారు. అందుకే తొలుత ఉత్తర భాగం ఆర్ఆర్ఆర్ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది.