Ujjaini Mahakali Temple: సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్ తదితరులు రేవంత్ వెంట ఉన్నారు. ఆర్థిక సంక్షోభం రాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, మత సామరస్యాన్ని కాపాడాలని. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా అమ్మ వారి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. 


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధికి హాని కలిగించే అనేక కార్యక్రమాలు పాలకులు తీసుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కృరమైన ఆలోచనలతో పరిపాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల బుద్దులు మార్చాలని అమ్మ వారిని కోరుకున్నం. సమాజానికి హానీ కలిగించే వ్యక్తులను అమ్మవారు శిక్షిస్తుంది. ప్రజలు, మనుషుల వల్ల కానీ పనులను అమ్మవారు చేస్తుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది. మానవ తప్పిదాల నుంచి వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టే విధంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నాం.


‘‘మానవమాత్రులుగా మేము చేయాల్సింది చేశాం. ప్రతిపక్షాల బాధ్యత నిర్వర్తించాం. కానీ పాలకులు ఎవరూ వినిపించుకోనే పరిస్థితి లేరు. సమస్యలను సృష్టించే వ్యక్తులకు అమ్మవారు సమాధానం చెబుతుంది. ఒక వేళ వారు మారకపోతే వాళ్లను మార్చి.. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాల్సిందిగా అమ్మవారిని కోరుకున్నం. కరోనా బారి నుంచి, వరదల నుంచి హైదరాబాద్ ను కాపాడాలని మేము గతంలో కోరుకున్నట్లే జరిగింది’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 


పోలీసులకు, రేవంత్ కు మధ్య వాగ్వివాదం
రేవంత్ రెడ్డి ఆలయానికి వచ్చిన సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. మహంకాళి ఆలయం వద్ద పోలీసులు, రేవంత్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ తో పాటు వచ్చిన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను తోసుకుని మరీ రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు లోనికి వెళ్లారు.