హైదరాబాద్‌లో తెల్లవారు జామున కిరాతకమైన ఘటన జరిగింది. భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. నగరంలోని కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ జియాగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వివాహితను సరిత యాదవ్ (26) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో ఆమె భర్త సంతోష్ పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా తన భార్యపై సంతోష్ అనుమానాన్ని పెంచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో కోపం పట్టలేని అతను తన ఇంట్లో సరితను ప్రైవేట్ పార్ట్‌లో కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ హత్యకు కారణం భార్యపై అనుమానమే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసే సమయంలో దాన్ని ఆపేందుకు మృతురాలి బంధువు అడ్డు రాగా, ఆ వ్యక్తిపై కూడా కత్తితో దాడి చేశాడు.


ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సమాచారం అందుకొని, ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, క్లూస్ టీమ్ కలిసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కులుసుంపుర పోలీసులు, క్లూస్ టీంలను రప్పించి, ఆధారాలు సేకరించారు. కేసు విచారణ చేసి, నిందితుడ్ని కోర్టులో హాజరు పరుస్తామని, రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.


ఓఆర్ఆర్‌పై కాల్పులు కలకలం


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్నట్టుండి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కారులో వచ్చిన ఓ వ్యక్తి ట్రక్కు డ్రైవర్‌పైన కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం రాత్రి ఓఆర్ఆర్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఎన్‌ఎల్‌ 01 ఏఎఫ్‌ 3226 ఓ భారీ ట్రక్కు ఓఆర్ఆర్ వెళ్తోంది. దాన్ని వెంటనే వస్తూ స్విఫ్ట్‌ కారులో వచ్చిన ఓ వ్యక్తి ఈ కాల్పులు చేశాడు. రెండు వాహనాలు శంషాబాద్‌ తుక్కుగూడ ఎగ్జిట్‌ 14 వద్దకు రాగానే అకస్మాత్తుగా లారీ డ్రైవర్‌పై కారులో వచ్చిన వ్యక్తి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. గురి తప్పటంతో డ్రైవర్‌‌కు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ పేరు మనోజ్ అని పోలీసులు తెలిపారు.


అయితే, ఈ కాల్పుల్లో లారీ అద్దాలు పగిలిపోయాయి. వెంటనే లారీ డ్రైవర్‌ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇనుముతో ఈ భారీ ట్రక్కు మెదక్‌ నుంచి కేరళలోని కొచ్చికి వెళ్తోందని డ్రైవర్ పోలీసులతో చెప్పారు. అయితే, నిందితులు దొంగలు అని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరగ్గానే కారులోనే నిందితులు పరారీ అవ్వగా, అతను కాల్పుల అనంతరం నిందితుడు వరంగల్‌ వైపు పరారై ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.