World Telugu Federation meeting in Hyderabad | హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అని చెబుతుంటారు. కానీ పోటీ పడాల్సింది పక్క రాష్ట్రాలతో కాదని, ప్రపంచ దేశాలతో అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోటీ పడే కన్నా తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తే ప్రపంచ దేశాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీపడేలా 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. యుద్ధాలే చర్చలతో పరిష్కారం అయినప్పుడు, తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలతో సమస్కలు ఎందుకు పరిష్కారం కావని పేర్కొన్నారు.


తెలంగాణ అభివృద్ధికి కోసం విజన్‌ 2050 ప్రణాళిక


హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వై వార్షిక సమావేశాల ముగింపు సభలో తెలంగాణ సీఎం  రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్‌ నినాదంతో వచ్చే 25 ఏళ్ల అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళికలు రూపొందించాం. ప్రపంచ దేశాల నగరాలలో పోటీ పడేలా నాలుగో సిటీని సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నాం. నేడు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మూడు దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. దేశంలోనే హిందీ తరువాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. 




చంద్రబాబు, వైఎస్సార్ కృషి చాలా ఉంది


రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేస్తే.. హైదరాబాద్‌ ఐటీ రంగంగా అభివృద్ధి చెందేలా చంద్రబాబు కృషిచేశారు. వైఎస్సార్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుల నిర్మాణంతో ఐటీ, ఫార్మాలో పెట్టుబడులతో అభివృద్ధి జరిగింది. గతంలో జాతీయ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలక పాత్ర పోషించారు. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, కాకా, జైపాల్ రెడ్డి, ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి. కానీ మన మధ్య పోటీ ఉండకూడదు.


మూడు, నాలుగు తరాలకు ముందు విదేశాలకు వలస వెళ్లినవారికి మనతో బంధం, అనుబంధాలు సన్నగిల్లుతున్నాయి. అందుకే ఇలా అందర్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ ప్రాంతాలలో, విదేశాలలో స్థిరపడిన తెలుగువారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. 



ఓఆర్ఆర్ స్ఫూర్తితో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం


కృష్ణా, గోదావరి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నాం. వరంగల్‌తో పాటు రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలంలలో కొత్త ఎయిర్‌పోర్టులకు శ్రీకారం చుట్టాం. బందర్‌ పోర్టు వరకు ప్రత్యేక నేషనల్ హైవేతో పాటు తెలంగాణలో డ్రైపోర్టు నిర్మించనున్నాం. ఔటర్‌ రింగు రోడ్డు (Hyderabad ORR) ఇచ్చిన స్ఫూర్తితో ప్రస్తుం 369 కిలోమీటర్ల మేర రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించనున్నాం. నేడు ఏ దేశంలో చూసినా ఇప్పడు తెలుగువాళ్లు  కనిపిస్తున్నారు. అక్కడ వారు అద్భుతంగా రాణిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలని’ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 


Also Read: CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి