Mahalakshmi and Gruha Jyothi Schemes: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు పథకాలను అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ సచివాలయం ఇందుకు వేదిక అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయిందని తెలిపారు. అందుకే చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న మరో రెండు గ్యారంటీల కార్యక్రమాన్ని సచివాలయానికి మార్చామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 27) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక్కడే అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి గ్యారంటీల్లో మరో రెండు పథకాలను ప్రారంభించారు. ఈ వేదికపై నుంచి ఐదుగురు లబ్ధిదారులకు రూ.500 కే సిలిండర్ ను రేవంత్ రెడ్డి అందించారు. తాము ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ప్రజలు తమకు ఓటు వేశారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
పేదలు కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడుతుంటే.. ఆనాడు యూపీఏ ప్రభుత్వమే దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.1200 కు తీసుకెళ్లిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిలిండర్ పై సబ్సిడీ ఇచ్చేందుకు ముందుకు రాలేదని.. తద్వారా వచ్చే పన్నుల ద్వారా లబ్ధి పొందాయని అన్నారు. తాజాగా తాము ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తు్న్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన పథకం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. నూటికి నూరు శాతం అన్ని హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తాము తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అలాగే, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని మరోసారి రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. అలాగే మహాలక్ష్మీ పథకం కింద సబ్సిడీతో రూ.500 సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మిలో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ ఉదయమే జీవో జారీ చేసింది. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. దాంట్లో వైట్ రేషన్ కార్డు దారులు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.500కే సిలిండర్ ఇవ్వనున్నారు.