TS Mega DSC 2024: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అన్ని అనుకూలిస్తే.. ఈ వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 


ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. మెగా డీఎస్సీ (TS Mega DSC) ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 


గత ప్రభుత్వం 5059 పోస్టులలో డీఎస్సీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, పండిట్‌ పోస్టులు 611, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 164, ఎస్జీటీ పోస్టులు 2,575 పోస్టులున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిన ప్రకారం 13 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోకుండా నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. అయితే ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. అయితే ఆ సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గత నోటిఫికేషన్‌ ను రద్దు చేసి, 11 వేల టీచర్‌ పోస్టులతో నాలుగైదు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నోటిఫికేషన్‌లోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్‌ టీచర్లను రిక్రూట్‌ చేయనున్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. తుది ఫలితాలు వెల్లడికి అడ్డంకిగా మారిన కోర్టు కేసులు, ఇతర కారణాలను న్యాయనిపుణులతో చర్చించి పరిష్కరించింది. పోలీస్‌, గురుకుల, స్టాఫ్‌ నర్స్‌ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది. గ్రూప్‌-1 కూడా హైకోర్టు తీర్పును అనుసరించి గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఎలాంటి కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలతో, పెంచిన పోస్టులతో కొత్త నోటిషికేషన్‌ జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్‌ వివాదరహితంగా ఉన్నదని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా కోర్టు కేసులతో మళ్లీ ప్రక్రియ ఆగుతుందనే ప్రచారాన్ని విశ్వసించవద్దని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.