దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని గుర్తు చేశారు. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందని చెప్పారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని అన్నారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని, దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసగించారు.
‘‘దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్ ను నిలబెట్టారు. పేదలకు అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా ఆనాడు బీజేపీ అడ్డుకుంది. తెలంగాణలో చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం ఉందంటే అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమే. స్వాతంత్ర్యానికి పూర్వపు పరిస్థితులే ఇప్పుడు దేశంలో ఉన్నాయి. బ్రిటిష్ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ పాద యాత్ర చేస్తున్నారు. తెలంగాణలో 375 కిలో మీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. చార్మినార్ లో జెండా ఎగరేసి ప్రజలకు సంపూర్ణ నమ్మకాన్ని కలిగించారు. మహాత్ముడి స్పూర్తితో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రతపై మోదీ ప్రభుత్వానికి పట్టింపు లేదు.
పాదయాత్ర ఆపేందుకే కొవిడ్ రూల్స్
రాహుల్ పాదయాత్ర భయంతోనే మోదీ కోవిడ్ రూల్స్ తీసుకొస్తున్నారు. దేశ సమగ్రతను పణంగా పణంగా పెట్టి బీజేపీ కుట్రలు చేస్తోంది. కేసీఆర్ చేతిలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదు. రాష్ట్రంలో ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మనకున్న సమస్యలను పక్కనబెట్టి ప్రజల కోసం కదలండి. జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రకు కదిలిరండి. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రతినబూనుదాం. వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని నేను శ్రేణులను కోరుతున్నా’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే ప్రజల సమస్యలు పెద్దవని రేవంత్ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. “రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయింది, కుటుంబ సభ్యులు పెరిగారు, వారి ఆశలు, ఆకలి పెరిగాయి, అందుకే బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. పార్టీ ఆఫీసు కోసం మూడు రోజులు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ఏపీ విభజన చట్టం ద్వారా మనకు హక్కుగా దక్కాల్సి ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని, ప్రతి గుండెను, ప్రతి తండాను తట్టి బీజేపీ, కేసీఆర్ ల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.