Assam CM Himanta Biswa Sarma Comments On Rahul Gandhi: తాము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటే తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు మండిపడుతున్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డితో కాంగ్రెస్ మహిళా నేతలు కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు భేటీ శుక్రవారం అయ్యారు. కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఇది ఆరంభం మాత్రమే..
తప్పు చేసినవారిని శిక్షించలేని పోలీసులు రాష్ట్రంలో ఆడవాళ్లను మాత్రం హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు చాలా ఉంటుందన్నారు. అస్సాం సీఎంపై పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో సెక్షన్లు మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవడం లేదు గానీ, మహిళా నేతల్ని మాత్రం అరెస్ట్ చేస్తారా అని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. దేశానికి గాంధీ - నెహ్రూ కుటుంబం ఎంతో సేవ చేసిందని, అలాంటి వారిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంను తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరారు.
సీఎం కుర్చీలో ఉన్న మూర్ఖుడు..
ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ అని తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ రాహుల్ గాంధీపై సీఎం హోదాలో ఉన్న బీజేపీ నేత చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆయనను సీఎం కుర్చీ నుంచి దింపేయాలన్నారు. భారత ఆర్మీ పాకిస్తాన్‌పై చేసిన సర్జికల్ స్ట్రైక్‌కు దేశ ప్రజలకు ఆధారాలు చూపిస్తే బాగుంటుందని అడిగిన కారణంగా.. రాహుల్ గాంధీ (Assam CM Himanta Biswa Sarma Comments On Rahul Gandhi) తండ్రి ఎవరని మేం ఎప్పుడైనా అడిగామా అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ అస్సాం సీఎంపై మండిపడ్డారు.
బీజేపీ నేతలు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నా రాహుల్ గాంధీ పల్లెత్తు మాట అనలేదు. మహిళలు అంటే బీజేపీ నేతలకు గౌరవం లేదా అని ప్రశ్నించారు. మహిళపై నిజంగానే గౌరవం ఉంటే అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల తరపున తెలంగాణ మహిళా కమిషన్ కు ఈ అంశంపై ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ అంశం తన పరిధిలోకి రాదని కేంద్ర కమిషన్ కు పంపిస్తామని రాష్ట్ర మహిళా కమి కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి చెప్పినట్లు గీతారెడ్డి వెల్లడించారు.