Trains Halt Removed: తెలుగురాష్ట్రాలకు దక్షిణ మధ్య రైల్వే ఓ బ్యాడ్‌ న్యూస్ అందించింది. తిరుపతి(Tirupati), చెన్నై(Chennai), విశాఖ(Vishakha) మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు ఇది కచ్చితంగా చేదువార్తే. సికింద్రాబాద్ నుంచి చెన్నై, విశాఖ, తిరుపతి వెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్‌ ఎత్తివేస్తింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు నల్గొండలో కూడా స్టాప్‌ ఎత్తివేశారు. ఈ నెల 19 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. 


మూడు రైళ్ల ‌స్టాప్‌లు ఎత్తివేత
తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కువదూరం ప్రయాణించే మూడు కీలక రైళ్లస్టాప్‌లు ఎత్తివేస్తూ  దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(Vishakha Express), హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్‌(Chennai Express), సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే నారాయాద్రి ఎక్స్‌ప్రెస్‌(Narayanadri Express)కు కీలకమైన మిర్యాలగూడ(Miryalaguda), నడికుడి(Nadikudi), పిడుగురాళ్ల(Piduguralla)లో హాల్ట్ ఎత్తివేశారు. దీంతో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వారు తిరుపతి వెళ్లాలంటే ఉన్న ఏకైక రైలు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే. ఈ రైలుకు ఏకంగా వరుస క్రమంలో ఉండే మూడు కీలక హాల్ట్‌లు ఎత్తివేయడంతో ఈ ప్రాంత ప్రజలంతా ఇటు నల్గొండ గానీ... అటు గుంటూరు గానీ వెళ్లాల్సిందే. ఇక విశాఖ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు అయితే ఏకంగా నల్గొండ హాల్ట్‌ కూడా ఎత్తివేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌(Secunderabad)లో బయలుదేరితే ఇక నేరుగా గుంటూరు(Guntur)లోనే ఆగనుంది. అటు చెన్నై  మార్గంలో వెళ్లేవారికి కూడా ఇబ్బందులు తప్పవు చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు సైతం ఈ మూడు హాల్టులు ఎత్తివేశారు.


కరోనా సమయంలోనే నిర్ణయం
కరోనా(Carona) సమయంలో రైళ్ల రాకపోకలు, హాల్టులపై తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. ప్రయాణాలు తగ్గించే క్రమంలో భారత రైల్వేశాఖ పలు రైళ్లకు హాల్టులను ఎత్తివేసింది. అప్పుడు ఈ మూడు రైళ్లకు ఈ మూడు హాల్టులు కూడా ఎత్తివేశారు. దీంతో రెండు ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆందోళన చేయడంతో అప్పటి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా రైల్వేబోర్డు అధికారులను కలిసి విజ్ఞప్తి చేయడంతో ఏడాది క్రితం ఈ మూడు రైళ్లకు పరిమిత కాలం వరకు స్టాప్‌‌లు ఏర్పాటు చేశారు. ఈనెల 19తో ఇచ్చిన సమయం ముగియడంతో ఈ మూడు రైళ్లకు స్టాప్‌లు మళ్లీ ఎత్తివేస్తున్నారు. ఈనెల 19 తర్వాత ఈ స్టేషన్లలో రిజర్వేషన్లు సైతం ఇప్పటికే ఎత్తివేశారు. 


నేరుగా వెళ్లే ప్రయాణికులకు ఆనందం
రైల్వేశాఖ నిర్ణయంపై ఉమ్మడి నల్గొండ(Nalgonda), గుంటూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా...దూరప్రాంతాలకు నేరుగా వెళ్లే ప్రయాణికులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా స్టేషన్లలో హాల్టులు ఎత్తివేయడంతో సమయం కలిసిరావడంతోపాటు  రైలులో రద్దీ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే గుంటూరు-సికింద్రాబాద్ మధ్య ఇంటర్‌సిటీ సహా పలు రైళ్లు ఉన్నాయి కాబట్టి ఏమంత ఇబ్బంది ఉండదని తెలిపారు.కానీఈ ఆయా ప్రాంతాల ప్రయాణికులు  మాత్రం రైల్వేశాఖ నిర్ణయంపై మండిపడుతున్నారు.