Maha Shivaratri 2025 Celebrations In Bheeramguda Temple  : హైదరాబాద్‌కు సమీపంలో సంగారెడ్డిజిల్లా భీరంగూడ గట్టుపై కొలువుదీరిన శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి శివరాత్రి మహా పర్వదిన సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. శివరాత్రి అంటే హైదరాబాద్ నగరం  నలుమూల నుంచి మాత్రమే కాదు, వివిధ జిల్లాల నుంచి సైతం భీరంగూడ చేరుకుంటారు. రాత్రంతా శివనామస్మరణతో మల్లికార్జున స్వామి ఆలయం మారుమోగుతుంది. హరహర మహాశివ అంటూ భక్తులు సందడి వర్ణనాతీతం. భీరంగూడ కమాన్ నుంచి ఆలయంలో లోపలికి వెళ్లే మార్గం వరకూ సుమారు మూడు కిలోమీటర్ల మేర భక్తులు రద్దీ ఉంటుంది. అంతలా ప్రత్యేకమైనది భీరంగూడ గట్టు.


భీరంగూడ శివాలయం 6వ శాతాబ్ధకాలంలో నిర్మించారు. బృగుమహర్షి, భోగమహర్షి ఇక్కడి భీరంగూడ గట్టుపై మహశివుని దర్శనం కోసం ఏళ్ల తరబడి తపస్సు చేశారని చెబుతారు. వారి తపస్సును మెచ్చిన పరమశివుడు లింగరూపంలో వీరికి దర్శనమివ్వడంతో ఇక్కడ శివలింగం ప్రతిష్టించి, ఆ తరువాత గుడిని నిర్మించారట. నిత్యం పూజలందుకుంటూ విరాజిళ్లుతోంది భీరంగూడ మహాశివాలయం.


 



కాలక్రమంలో కొంత నిర్లాక్ష్యానికి గురై, శిథిలావస్థకు చేరుకుంది. ఆ తరువాత దాతల సహాకారంతో తిరిగి ఆలయాన్ని పునర్‌నిర్మించారు. నాటి నుంచి నేటి వరకూ ఏటా శివరాత్రి పర్వదినం వచ్చిందంటే భీరంగూడ గట్టు వేలాదిగా భక్తులతో కిక్కిరిపోతుంది. తెల్లవారుజాము నుంచి శివరాత్రి మరుసటిరోజు తెల్లవారేవరకూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.


దేశంలో మరెక్కడా లేనట్లు ఈ ఆలయంలోని రజిత మండపంలో చతురస్రాకారంలో శివలింగం ఉంటుంది. ఇలా చతురశ్రాకారంలో శివలింగం నిత్యం ప్రత్యేక అభిషేకాలు, పూజలందుకుంటూ ఉంటుంది. ప్రతీ సోమవారం ఇక్కడ దహితో చేసే అభిషేకం విభిన్నమైనది. 6వ శతాబ్ధకాలం నాటి ఈ ఆలయానికి ఆరు అంతస్తుల రాజగోపురం, గోపురం పైన పంచకలశాలు ఉంటాయి. గోపురంపైన ప్రతీ అంతస్తులో దేవతామూర్తుల విభిన్న విగ్రహామూర్తులు భక్తులను ఆకట్టుకుంటాయి.ఈ రాజగోపురం నుంచి భక్తులు ప్రధాన ఆలయంలోకి అడుగుపెడతారు. లోపల గర్భాలయంలో రజిత మండపం, చతుశ్రాకారంలోని శివలింగం చూడగానే మహాశివును రూపం కళ్లముందు కదలాడుతుంది.


Also Read: పరమేశ్వరుడిని మెప్పించే మార్గం ఇదే.. మహాశివరాత్రి రోజు ఆచరించండి!


గర్భాలయం వెనుక భాగంలో భ్రమరాంబికాదేవి కొలువదీరి ఉంటుంది. మల్లికార్జునస్వామి తరువాత ఇక్కడ భ్రమరాంభికాదేవి విశేష పూజలు అందుకుంటుంది.స్థానక భంగిమలో చతుర్భాహువులతో అమ్మవారు దర్శమిస్తుంటారు. రజితకవచాభరణాలు, వెండి మకర తోరణాలు, కిరీటం, నిత్యం పుష్పాలంకరణతో అమ్మవారి దర్శం చూస్తుంటే రెండు కళ్లు చాలవన్నట్లుగా ఉంటుంది.  అమ్మవారి పాదపీటం వద్ద ఉన్న శ్రీచక్రం నిత్యం కుంకుమ పూజలు అందుకుంటోంది. ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. భ్రమరాంబ అమ్మవారి ఆలయ గోడలపై దక్షిణమూర్తి, నటరాజస్వామి, లలితాంభికా విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.


భీరంగూడ గట్టుపై కొలువుదీరిన శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయం లోపల అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. గణపతి, సుబ్రమణ్యేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులకు దర్శనిస్తున్నాయి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఇక్కడ 6శతాబ్ధం నాటి పురాతన గుహ. ఈ ఆలయం వద్ద ఉన్న ఈ గుహ మార్గం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి నేరుగా చేరుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇలా నిత్యం ప్రత్యేక పూజలతో విరాజిల్లుతున్న ఈ ఆలయం, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవ వైభవాన్ని సంతరించుకుంది.


Also Read: శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం చేయలేనివారు... ఈ 40 నిముషాలు కేటాయించండి చాలు!