Hyderabad Real Estate News: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన సగటున 6 శాతం పెరిగాయని క్రెడాయ్ కొలీర్స్, లియాసెస్ ఫొరాస్ నివేదిక పేర్కొంది. దిల్లీ ఎన్‌సీఆర్‌తో పోలిస్తే హైదరాబాద్‌లోనే చదరపు గజం ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లో పెరిగిన ధరల వివరాలను నివేదిక వెల్లడించింది.
గతేడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి దిల్లీ ఎన్‌సీఆర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు ఏకంగా 14 శాతం ఎగిశాయి. నగరంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో 21 శాతం పెరగ్గా గాజియాబాద్ తర్వాతి స్థానంలో ఉంది. కోల్‌కతా, అహ్మదాబాద్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. వార్షిక ప్రాతిపదికన వరుసగా 12%, 11% పెరిగాయి. విచిత్రంగా ముంబయి, చెన్నై నగరాల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
'దేశవ్యాప్తంగా స్థిరాస్తి మార్కెట్ రికవరీ అవుతోంది. ధరల్లో వృద్ధి కనిపిస్తోంది. కొవిడ్ తర్వాత సొంత ఇళ్లు ఉండాలన్న సెంటిమెంటు ప్రజల్లో బలంగా పెరిగింది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదం చేస్తున్నాయి' అని క్రెడాయ్ నేషనల్ అధ్యక్షుడు హర్ష వర్దన్ పటోడియా తెలిపారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో రేట్లు పెరిగాయని, టాప్ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు ఆరంభిస్తున్నారని పేర్కొన్నారు.
'ఈ ఏడాది చివరి వరకు పండగల జోష్ కొనసాగుతుంది. అమ్మకాలు పెరుగుతాయని మేం అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇక్కడా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. సొంతిటి కల నేరవేర్చుకొనేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉంది' అని పటోడియా వెల్లడించారు.
ముంబయి మెట్రో రీజియన్‌లో అన్‌సోల్డ్ ఇన్వెంటరీ పెరగ్గా బెంగళూరులో తగ్గింది. వార్షిక ప్రాతిపదికన ముంబయిలో అమ్మకం కాని ఇళ్లు 21శాతం పెరిగాయి. కాగా ఎనిమిది నగరాల్లో కొత్త ప్రాజెక్టులు 39 శాతం పెరిగాయి. మూడో త్రైమాసికంలో బెంగళూరులో అమ్ముడు పోని ఇళ్లు 14 శాతం తగ్గాయి. 6 శాతం ధరలు పెరిగినా విక్రయాలు పెరగడం గమనార్హం.
ముంబయి నగరంలో చదరపు గజం సగటు ధర రూ.19,485గా ఉంది. హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ చదరపు గజం ధర రూ.9,266గా ఉంది. ఈ త్రైమాసికంలో ధర ఒక శాతం తగ్గగా గతేడాదితో పోలిస్తే 8 శాతం పెరిగింది. పుణె, బెంగళూరు చదరపు గజం ధర రూ.8000, దిల్లీ, చెన్నైలో రూ.7500, అహ్మదాబాద్‌లో రూ.6000గా ఉన్నాయి.