తెలుగు సూపర్ స్టార్ కృష్ణ (79) మృతితో సినిమా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. పద్మాలయ స్టూడియోస్‌లో ఉన్న ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే గతంలో ఆయనతో హీరోయిన్ గా నటించిన, ప్రస్తుతంగా ఏపీ మంత్రిగా ఉన్న రోజా సూపర్ స్టార్‌కు నివాళులు అర్పించారు. అనంతరం, మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన వ్యక్తి అని రోజా కొనియాడారు. సాహసాలు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారని, అందరూ ఇష్టపడే వ్యక్తుల్లో హీరో కృష్ణ కూడా ఒకరని అన్నారు. ప్రస్తుతం ఆయన లేరు అనే మాటను ఎవరూ జీర్ణించుకోని పరిస్థితి ఉందని అన్నారు. సినీమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ లేకపోవడం తీరని పెద్దలోటు అని అన్నారు. తన చిన్నతనం నుంచి తాను కృష్ణకు అభిమానిని అని.. ఆయన సొంత చిత్ర నిర్మాణ సంస్థలో ఎన్నో సినిమాలు చేశానని గుర్తు చేసుకున్నారు.
‘‘ఆయన సొంత బ్యానర్‌లో నేను సినిమా చేయడం నా అదృష్టం. కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఇది కృష్ణను చూసి నేర్చుకోవాలి’’ అంటూ కామెంట్లు చేశారు. అద్భుతమైన వ్యక్తి అని, ప్రతిభావంతుడు, మంచి మనిషితో కలిసి పని చేయడం అదృష్టంగా భావించినట్టు రోజా చెప్పారు. ఫస్ట్ 70ఎంఎం సినిమా తీసింది ఆయనే అని గుర్తు చేశారు. అలాగే ఫస్ట్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తీసింది కూడా ఆయనే అని రోజా పొగడ్తలతో ముంచెత్తారు. కృష్ణ సినిమా వల్లే మనందరికీ అల్లూరి సీతారామరాజు గురించి తెలిసిందన్నారు. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ రూపమే కనిపిస్తుందని అన్నారు.
కొంత మందికి రెండు సినిమాలు హిట్ కాగానే కొమ్ములొస్తాయని, లేదా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఒత్తిడికిలోనై బయటికి రాకుండా పోతారని అన్నారు. కానీ, కృష్ణ ఎప్పుడు నిలకడ మనస్తత్వంతోనే ఉండేవారని అన్నారు. తనను కృష్ణ, విజయనిర్మల ఆదరించడాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. మహేశ్ బాబు అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని అన్నారు. మరోసారి తాను సినిమాల్లో నటించాలని వస్తే మహేశ్ బాబు అత్త పాత్రగా నటించాలని ఉందని రోజా చెప్పారు.
మహేష్ బాబుకు అత్తగా నటించాలని ఉంది - రోజా
కృష్ణ జీవితం గురించి తెలుసుకోవాల్సింది ఒక్కటే అంటూ రోజా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ ఉంటాయని అన్నారు. సక్పెస్, ఫెయిల్యూర్‌లను సమానంగా తీసుకుంటే, ప్రశాంతంగా ఉంటామనే పాఠాన్ని కృష్ణ లైఫ్ నుంచి నేర్చుకోవచ్చని అన్నారు. ఎంత పెద్దస్థాయికి ఎదిగినా అందరితో బాగుండాలనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకోవాలని రోజా చెప్పారు.
ఉదయం నివాళి అర్పించిన సీఎం జగన్
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోకు చేరుకున్న జగన్... దిగ్గజనటుడి పార్థివదేహాన్ని సందర్శించారు. ఆయనకు నివాళి అర్పించిన తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీని ఓదార్చారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. కాసేపు వారితో మాట్లాడారు. సుమారు 15 నిమిషాల పాటు అక్కడ ఉన్న జగన్ తర్వాత తిరుగు పయనమయ్యారు.
జగన్, బాలకృష్ణ పలకరింపులు
కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించే టైంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. మహేష్‌బాబు, ఆయన ఫ్యామిలీతో మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి బాలకృష్ణకు కూడా పలకరించారు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, పార్టీ లీడర్లు కూడా కృష్ణ భౌతిక కాయానికి అంజలి ఘటించారు.