Telangana High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవేతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి తన ఆఫీసుకి ఒక సీల్డ్‌ కవర్‌ వచ్చిందని అన్నారు. దాన్ని ఏం చేయమంటారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌.. ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవేని సలహా కోరగా, ఆయన అందులో ఏమేం ఉన్నాయని అడిగారు. అందులో ఒక సీడీ, పెన్‌ డ్రైవ్‌ లాంటివి ఉన్నాయని వాటిని అలాగే సీల్‌ చేసి పక్కన ఉంచాలని చెప్పానని సీజే ఉజ్జల్ వెల్లడించారు. అయితే, ఆ కవర్ ​ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, దాన్ని పడేయాలని సదరు న్యాయవాది సీజేకు సూచించారు.


అయితే, ఇలాంటి కవర్‌ తనకు కూడా అందిందని దాన్ని ఏం చేయాలని ఇంకో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తనను సలహా అడిగారని చెప్పారు. మంగళవారం (నవంబరు 15) హైకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే సమాధానం ఇస్తూ.. అలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఇది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పారు. నేరుగా న్యాయమూర్తికి సీల్డ్ కవర్లు పంపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 


అంతేకాకుండా దర్యాప్తు సంస్థలు కూడా తమ విచారణలోని విషయాలను బయట మీడియాకు నేరుగా వెల్లడించడం మామూలు అయిందని అన్నారు. ఈడీ, సీబీఐలు కూడా తమ విచారణ అంశాలు, ఆధారాలన్నింటినీ కూడా మీడియాకు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘ప్రముఖ దర్యాప్తు సంస్థ అయిన సీబీఐని చూడండి, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఏమైందో అందరికీ తెలుసు, ప్రతిరోజూ టెలివిజన్‌లో చాలా వార్తలు, దర్యాప్తు ఏజెన్సీ విషయాలను లీక్ చేస్తున్న తీరు ఇదే’’ అని దుశ్యంత్ అన్నారు.


రాజకీయ వ్యవహారాలకు న్యాయవ్యవస్థలను వేదిక చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకోవాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌కు కూడా సలహా ఇస్తానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన కవర్‌ను పట్టించుకోవద్దని, వీలైతే దాన్ని పడవేయాలని సూచించారు. ఎవరికైనా ఆ మెటీరియల్‌ని దొరికితే పరిస్థితి ఏమిటని సీజే అన్నారు. అయితే, ఆ మెటీరియల్ ని నాశనం చేయాలని దవే బదులిచ్చారు. 


న్యాయమూర్తులకు సీల్డ్‌ కవర్లు పంపడం న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారనడానికి నిదర్శనమని బీజేపీ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ పేర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇవే రికార్డులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారని అలా పంపడం తీవ్రమైన విషయం అని అన్నారు.


మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన రోజు రాత్రి (నవంబరు 3) సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫాంహౌజ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలను తాను దేశంలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు పంపించానని చెప్పారు. ఆ కవర్ గురించే తాజాగా సీజే, సీనియర్ న్యాయవాదికి మధ్య ఈ చర్చ జరిగింది.