Rapido Free Rides in Hyderabad, Karimnagar, Warangal, Khammam: బైక్, ఆటో, కారు ట్యాక్సీ సేవలను అందించే ప్రముఖ సంస్థ ర్యాపిడో తమ వినియోగదారులకు ఓ ఆఫర్ ను ప్రకటించింది. తెలంగాణలో పోలింగ్ జరిగే రోజు మే 13న ఫ్రీ రైడ్ వెసులుబాటును కల్పించింది. ఓటింగ్ శాతాన్ని పెంచడంలో తమవంతు పాత్ర పోషించే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ర్యాపిడో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇందులో భాగంగా పోలింగ్ జరిగే మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లే ఓటర్లు ఫ్రీ రైడ్ ను పొందొచ్చు. ర్యాపిడో యాప్‌లో VOTENOW అనే కోడ్ ను ఉపయోగించి ఫ్రీ రైడ్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.


ఇందుకోసం ర్యాపిడో సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పని చేస్తోంది. ఈ ఆఫర్ కు సంబంధించి ఎల్బీ స్టేడియంలో ర్యాపిడో సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కూడా హాజరయ్యారు. ఎలక్షన్ రోజున దేశ వ్యాప్తంగా 100 నగరాల్లో దాదాపు 10 లక్షల మంది క్యాప్టెన్లు పోలింగ్ శాతం పెంచే కార్యంలో కీలక పాత్ర పోషిస్తారని కంపెనీ తెలిపింది. ఫ్రీ రైడ్ వెసులుబాటు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి నగరాల్లోనూ అందుబాటులో ఉండనుంది.


‘‘హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ప్రతి ఓటర్ తమ హక్కును వినియోగించడానికి మా వంతు పాత్ర పోషిస్తున్నాం. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి సులభంగా చేరుకుంటే పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని భావిస్తున్నాం. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోవడానికి ర్యాపిడో ప్రత్యేకించి దృష్టి సారించింది. అందుకే వీరికి ఉచిత ఆటో, క్యాబ్ రైడ్‌లను అందిస్తున్నాం’’ అని ర్యాపిడో కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి తెలిపారు. 


తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘2024 సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్లకు ఉచిత రైడ్‌లను అందించడానికి ర్యాపిడో తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ఓటర్లకు ప్రత్యేకించి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్‌లకు ఉచిత రైడ్ ఇవ్వడం వారు పోలింగ్ కేంద్రానికి రావడానికి చాలా ఉపకరిస్తుంది. అర్హులైన ప్రతి పౌరుడు వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోగలరని మేం కోరుతున్నాం’’ అని వికాస్ రాజ్ అన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.