Ramoji Rao Funeral Latest News: తెలుగు మీడియా రంగ దిగ్గజం, వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో తాను నిర్మించుకున్న స్మృతివనంలోనే రామోజీ రావు ఆఖరి క్రతువు ముగిసింది. ఆయన పెద్ద కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ రామోజీ రావు చితికి నిప్పు అంటించారు. వెంట మనవడు సుజయ్ కూడా ఉన్నారు. రామోజీ రావు భార్య, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి సహా మనవడు సుజయ్, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ ఇతర కుటుంబ సభ్యులు కన్నీటితో రామోజీరావుకు వీడ్కోలు పలికారు.


అంత్యక్రియల సమయంలో పోలీసులు గౌరవవందనంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ గ్రూపు ఉద్యోగులు, అభిమానులు జోహార్‌ రామోజీరావు.. జోహార్ రామోజీ రావు అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్యే అంత్యక్రియలు ముగిశాయి.


అంతిమ సంస్కారాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పోచారం, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్‌ నాయకులు వేం నరేందర్‌ రెడ్డి, వీహెచ్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజు, వెనిగండ్ల రాము, బీజేపీ ఎంపీలు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఏపీ నాయకులు సుజనా చౌదరి, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూరి జస్టిస్‌ ఎన్వీ రమణ, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సహా ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు.