హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఓ బాలుడు కొట్టుకుపోయాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కల్వర్టు వద్ద వరద నీటిలో నితిన్ అనే నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. సాయి నగర్ చెరువులోకి కొట్టుకెళ్లినట్టుగా స్థానికుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రగతి నగర్‌ ఎన్‌ఆర్‌ఐ కాలనీ సమీపంలోని ఓ నాలాలో బాలుడు పడిపోయాడు. ఈ క్రమంలో నిజాంపేట రాజీవ్‌ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో సమాచారం పోలీసులకు అందడంతో నితిన్‌ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలం కావడంలో అక్కడే ఉన్న తుర్క చెరువులోకి మృతదేహం కొట్టుకుపోయింది. చెరువు దగ్గరికి చేరుకున్న పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్‌) బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు.


బాలుడు గల్లంతు అయిన వీడియో కూడా వైరల్ అవుతుంది. స్థానిక సీసీటీవీ కెమెరాలో బాలుడు నాలాలో పడిపోయిన ఫుటేజీ రికార్డ్ అయింది. అందులో ముందు ఓ పెద్దాయన నడుస్తుంటే వెనుకనే బాలుడు కూడా నడుస్తున్నాడు. ఆ విషయాన్ని ఆ వ్యక్తి గుర్తించకుండా నాలాను దాటాడు. వెంటనే ఆ వెనుక ఉన్న బాలుడు కూడా​ నాలాను దాటడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే నిండుగా పొంగి ప్రవహిస్తున్న నాలాలో పడి రెప్పపాటులో కొట్టుకుపోయాడు. ఆ విషయం ముందు నడుస్తున్న వ్యక్తి గుర్తించలేదు. లేకపోతే బాలుడు ప్రాణం నిలిచే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.


మేయర్ పర్యటన


మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ సర్కిల్  వరద ప్రాంతాల్లో  ఎమ్మెల్యే వివేకానందతో కలిసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ళలో నీటిని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపునకు గురైన అయోధ్య నగర్, గణేష్ నగర్, ఐడీపీఎల్ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు సహాయక చర్యలు తీసుకుంటామని మేయర్ భరోసా ఇచ్చారు.