Telangana High Court: బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై మంగళవారం రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ గతంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ హైకోర్టు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పటిషన్ పై తాజాగా హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాదనల సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్ కు సంజయ్ హాజరు కాలేదు. దీంతో రాష్ట్ర ఉన్న న్యాయస్థానం బండి సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటిికే పలుమార్లు క్రాస్ ఎగ్జామినేషన్ కు సంజయ్ తరఫు న్యాయవాది గడువు కోరారు. 


మంగళవారం మరోసారి బండి సంజయ్ పిటిషన్ విచారణకు రాగా.. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాల్సిన బండి సంజయ్.. హాజరు కాకపోవడంతో హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం బండి సంజయ్ అమెరికాలో ఉన్నందు వల్ల మరోసారి గడువు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. జులై 21 నుంచి మూడు సార్లు బండి సంజయ్ గడువు కోరారు. ఎన్నికల పిటిషన్లు 6 నెలల్లో తేల్చాల్సి ఉన్నందు వల్ల విచారణ ముగిస్తామనని హైకోర్టు కరీంనగర్ ఎంపీ తరఫు న్యాయవాదిని హెచ్చరించింది. ఈ నెల 12వ తేదీన బండి సంజయ్ హాజరు అవుతారని న్యాయవాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.


2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ పోటీ చేయగా.. ఆ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోయారు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై విజయం సాధించారు.