సైబర్ నేరాల నుంచి తప్పించుకొనేందుకు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. ఈ - మెయిల్, ఫోన్ లాక్, బ్యాంకు ఖాతాలకు పాస్ వర్డ్‌లుగా పూర్తి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, పెళ్లి తేదీ, తల్లి పేరు వంటి వాటిని పెట్టుకోవద్దని సూచించారు. ఇలా పాస్ వర్డ్ లు పెట్టుకోవడం ద్వారా బ్యాంకు ఖాతాలు లేదా ఇతర పాస్ వర్డ్ లను సులభంగా క్రాక్ చేసే అవకాశం ఉందని వివరించారు. ఇటీవల మహేశ్ భగవత్ సైబర్ మోసాల గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలు సూచనలు చేశారు.


అంతేకాకుండా, కొంత మంది తమ లవర్స్ పేరును పాస్ వర్డ్ గా పెట్టుకుంటున్నారని వివరించారు. మరికొంత మంది మాజీ గర్ల్ ఫ్రెండ్ పేర్లను కూడా పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటున్నారని తాము గుర్తించినట్లుగా చెప్పారు. ఎవరూ కూడా వ్యక్తిగత సమాచారం అయిన పుట్టిన తేదీ లాంటి వివరాలను ఎక్కడా బహిర్గతం చేయవద్దని సూచించారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరును పాస్ వర్డ్‌గా పెట్టుకున్న కొన్ని సందర్భాల్లో వారి భార్యకు దొరికిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కాబట్టి, స్ట్రాంగ్ పాస్ వర్డ్‌లు పెట్టుకొని తమ డిజిటల్ వాలెట్స్ లోకి ఎవరూ ప్రవేశించకుండా చూడాలని పిలుపునిచ్చారు.






కమిషనర్ పేరుతో ఫేక్ వాట్సప్ అకౌంట్
సామాన్యులను బురిడీ కొట్టించే సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లతోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లు కేటుగాళ్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేరుతో ఫేక్ అకౌంట్ వెలుగులోకి వచ్చింది. విషయం గుర్తించిన మహేశ్ భగవత్ స్పందించారు. ఫేక్ వాట్సప్ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవ్వరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. 8764747849 నెంబరుతో ఫేక్ వాట్సప్ అకౌంట్ చెలామణి అవుతుందని పోలీస్ కమిషనర్ చెప్పారు.


క్రికెట్ నిర్వహణలో రాచకొండ పోలీసుల పటిష్ఠ బందోబస్తు


నిన్న (సెప్టెంబరు 25) హైదరాబాద్ లో జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి రాచకొండ పోలీసులు ఎంతో సహకరించారు. వారు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 2,500ల మంది పోలీసులతో మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తం సీసీటీవీ కెమెరాల నిఘా నీడలో ఉంచారు.


మహేశ్ భగవత్ ప్రత్యక్ష పర్యవేక్షణ
ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌ భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ స్వయంగా పర్యవేక్షించారు. వారం రోజుల ముందు నుంచే సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తూ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. పార్కింగ్‌ విషయంలోనూ ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.