Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై, రాష్ట్ర సర్కారు వైఫల్యాలపై నిత్యం తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విమర్శించే వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలపై, నాయకులపై తీవ్రస్థాయిలో గళమెత్తుతారు. చిన్న అంశం దొరికినా.. చీల్చి చెండాడతారు. ఆయన రాష్ట్రంలో బీజేపీ చీఫ్ అయ్యాక బీజేపీ రాజకీయం, దూకుడు, వ్యూహాలు, పోరాట పటిమ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి  ఇప్పుడు కొద్దిగా స్వరం తగ్గించనున్నారు. ప్రతిపక్ష నాయకులపై, పార్టీలపై హై పిచ్ లో విమర్శలు చేసే బండి సంజయ్.. ఆ తరహా విమర్శలకు దూరం కానున్నారు. ఎందుకు అన్న సందేహాలు అక్కర్లేదు. అది రాజకీయ వ్యూహమూ కాదు. 


దీక్ష తీసుకున్న బండి సంజయ్


ఎప్పుడూ వైట్ అండ్ వైట్ ఖద్దర్ దుస్తుల్లో కనిపించే బండి సంజయ్.. ఇప్పుడు ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించనున్నారు. పూర్తిగా ఎరుపు దుస్తులే ధరించనున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ తన పేరుకు తగ్గట్లే ఎరుపు దుస్తులు వేసుకోనున్నారు. ఎప్పుడూ ఉగ్రనరసింహుడిలా కనిపించే బండి సంజయ్.. ఇప్పుడు శాంత మూర్తిలా కనిపించనున్నారు. ఎందుకు అంటే బండి సంజయ్ దుర్గా దీక్ష తీసుకున్నారు. దుర్గమ్మ పరమ భక్తుడు అయిన బండి సంజయ్.. నవరాత్రుల వేళ దుర్గా దీక్ష తీసుకోవడం చాలా ఏళ్లుగా వస్తోంది. ఈ నవరాత్రుల్లో ఆయన పూర్తిగా శాంతంగా కనిపిస్తారు. పూర్తిగా అమ్మవారి సేవలోనే నిమగ్నమవుతారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా బండి సంజయ్ మాల వేసుకున్నారు. ఏటా చేస్తున్నట్లుగానే కరీంనగర్ చైతన్య పురి కాలనీలోని మహాలక్ష్మీ ఆలయంలోనే పూజలు చేస్తారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యం అమ్మవారి సేవలోనే తరించనున్నారు. 






నవరాత్రులు అమ్మవారి సేవలోనే


కొన్నేళ్లుగా అమ్మ వారి మాల వేసుకుంటున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్.. నవరాత్రుల్లో ప్రతిపక్ష పార్టీలపై, నాయకులపై ఎలాంటి విమర్శలు చేయరు. అమ్మ వారి మాల ఆయన మెడలో ఉన్నంత వరకు ఆయన విమర్శలకు దూరంగా ఉంటారు. కొన్నేళ్లుగా అలాగే ఉన్నారు. ఇప్పుడూ అదే పని చేయనున్నారు. దుర్గమ్మ అంటే బండి సంజయ్ కు ఎనలేని భక్తి ప్రపత్తులు. ఆయన ఏ కార్యం తలపెట్టినా.. అమ్మవారిని తలచుకుంటారు. నిత్యం రాజకీయాలతో, వ్యూహాలతో బిజీబిజీగా గడిపే బండి సంజయ్.. రోజూ అమ్మవారికి పూజ చేయనిదే తన రోజును ప్రారంభించరు. తనకు ఆ అమ్మవారి దీవెనలు ఉంటాయని విశ్వసిస్తారు. ఈ నవరాత్రుల్లో ఉపవాసం పాటిస్తారు బండి సంజయ్. నవరాత్రుల వేళ నిత్యం అమ్మ వారి సేవలోనే ఉంటారు. తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో గడుపుతారు. పొద్దంతా బండి సంజయ్ మిగతా పనుల్లో బిజీగా ఉన్నా.. సాయంత్రం కాగానే.. అమ్మ వారి ఆలయంలో గడుపుతారు. ఈ నవరాత్రుల్లో చైతన్యపురిలోని అమ్మ వారి ఆలయానికి వెళ్లిన వారు బండి సంజయ్ ను కలుసుకునే వీలు ఉంటుందని చాలా మంది వచ్చి సెల్ఫీలు దిగడం లాంటివి చేస్తారు.