Krishna News: పాము కాటు చాలా ప్రమాదకరం. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాలు పోతాయి. దేశవ్యాప్తంగా ఏటా వేల మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి జనవాసాల్లోకి వచ్చే పాములు.. తమను తాము కాపాడుకునేందుకు కాటు వేస్తాయి. అయితే పాము కాటు వేయగానే.. సరైన చికిత్స అందితే ప్రాణాలు నిలుపుకోవచ్చు. అయితే చాలా మంది పాములను చూడగానే భయంతో వాటిని కర్రలతో కొట్టి చంపేస్తారు. అవీ జీవులే. ఈ భూమిపై జీవించేందుకు వాటికి కూడా హక్కు ఉందని తెలిసిన కొందరు మాత్రం వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలి పెడతారు. వీరిని స్నేక్ క్యాచర్స్ అంటారు. పాములు పట్టుకునేందుకు కూడా లైసెన్స్ ఉండాల్సిందే. కానీ మన వద్ద ఎలాంటి లైసెన్స్ అవసరం లేకుండానే పాములు పట్టే వాళ్లు చాలా మంది ఉంటారు. ఇంట్లో, ఆరు బయట, పని ప్రదేశంలో పాములు కనబడగానే పాములు పట్టే వారికి సమాచారం ఇస్తాం. వారు చాకచక్యంగా పాములు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. అలా పాము పట్టడానికి వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. 


పాములు పట్టే వ్యక్తికి పాము కాటు


పాములు పట్టే అలవాటు ఉన్న ఓ వ్యక్తి అదే పాము కాటుతో ప్రాణం కోల్పోయారు. ఆయన పేరు కొండూరి నాగబాబు శర్మ. వృత్తి రీత్యా  పురోహితుడు. ఆయనది కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ. అయితే.. కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దసరా కావడంతో స్వగ్రామం కృత్తివెన్నుకు వచ్చారు. గ్రామాల్లో కనిపించే పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేసే అలవాటు ఆయనకు ఉంది. కృత్తివెన్ను పీతలావ గ్రామస్థులు కొండూరు నాగబాబు శర్మను శనివారం మధ్యాహ్నం పిలిచారు. వాళ్ల విజ్ఞప్తి మేరకు పామును పట్టుకున్నారు నాగబాబు శర్మ. ఎప్పట్లాగే ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసే ప్రయత్నంలో ఉండగానే పాము కాటు వేసింది. అతని చేతిపై కాటు వేసింది.


పాము కాటువేసినా ఆయన పామును మాత్రం వదల్లేదు. దాన్ని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టేశారు. తర్వాత ఇంటికి వచ్చిన తనను పాము కాటు వేసిన చోట ప్రథమ చికిత్స తీసుకున్నారు. కానీ కొంతసేపటికే పరిస్థితి విషమించింది. సమీపంలోని చినపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నాగబాబు శర్మను పరీక్షంచి పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని వారు చెప్పారు.


నాగబాబు శర్మ కుటుంబ సభ్యులు ఆయనను సొంత కారులో మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాగబాబు శర్మకు వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. కానీ వైద్యం చేస్తుండగానే కొండూరి నాగబాబు శర్మ ప్రాణాలు కోల్పోయారు. 


ఎంతోమందిని కాపాడిన వ్యక్తే ప్రాణాలు కోల్పోయాడు


ఎంతో మందిని పాము కాటు బారి నుంచచి రక్షించిన పురోహితుడు కొండూరి నాగబాబు శర్మ అలా పాము కాటులో ప్రాణాలు కోల్పోవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాగబాబు శర్మ మరణంతో కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం స్థానికులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు నాగబాబు శర్మ మృతదేహానికి నివాళి అర్పించారు. పగటి సమయంలో గుడిదిబ్బ గ్రామంలోనే నాగబాబు శర్మకు అంత్యక్రియలు నిర్వహించారు. కొండూరి నాగబాబు శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.