ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్లు వేలాది రూపాయలు పేరుకుపోయాయనే ఉద్దేశంతో వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికే కొంత మంది ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోడానికి సెకండ్ హ్యాండ్ లో వాహనం అమ్మేయడం వంటివి చేస్తున్నారు. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేసి చలాన్లు కట్టకుండా ఎగవేస్తున్నారు. ఈ విషయం గమనించిన పోలీసులు అందుకు అవకాశం ఇవ్వకుండా చేయబోతున్నారు.


హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి కేసులు నమోదు చేయనున్నారు. రోజూ 40 లక్షలకుపైగా వాహనాలు వివిధ మార్గాల్లో హైదరాబాద్ లో రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 70 శాతం బైక్ లే ఉంటాయి. చలానా నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబరు ప్లేట్లను తొలగించడం, మరికొందరు పాత వాహనం విక్రయించి మరో సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఇక నుంచి ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీల్లో యజమాని పేరుతో ఉన్న మిగిలిన వాహనాల వివరాలను కూడా బయటకు తీయనున్నారు. వాటిపై పాత చలానాలు ఉన్నట్లు కనుక గుర్తిస్తే అక్కడికక్కడే వసూలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


మరోవైపు, పెండింగ్‌ చలాన్లు కట్టకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అని లైట్‌ తీసుకునే వారికి కూడా ట్రాఫిక్‌ పోలీసులు ఝలక్‌ ఇస్తున్నారు. మూడు నెలల్లో రెండు, మూడు ఉల్లంఘనలకు పాల్పడితే రెండింతలు, మూడింతలు జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్‌ లేని ప్రయాణం, రాంగ్‌ రూట్ డ్రైవింగ్‌, అక్రమ పార్కింగ్‌, అతివేగం, సిగ్నల్‌ జంపింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వంటి వాటికి విధిస్తున్నారు. ఇందులో ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకమైన జరిమానా ఉంటుంది. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌లో ద్విచక్రవాహనానికి రూ. 200, కారుకైతే రూ. వెయ్యి ఫైన్‌ విధిస్తారు. ఇలా మోటార్‌ వాహనాల చట్టంలో ఉన్న కీలక సెక్షన్లను ఉపయోగించి ఈ ఫైన్లను విధిస్తున్నారు.


వెంటనే చెల్లించకపోతే రెట్టింపు
హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.100 జరిమానా విధిస్తారు. ఇది ఆ వాహనదారుడు వెంటనే చెల్లించుకోవాలి. కట్టకుండా మరో వారం లేదా పది రోజుల్లో ఇంకోసారి చలానా పడితే, మొదటిది రూ. 100తో పాటు రెండో సారి తప్పు చేస్తే.. రూ.200 వేస్తారు. మొదటి రెండు జరిమానాలు చెల్లించకుండా మరో 15 రోజుల్లో ఇంకోసారి ఉల్లంఘిస్తే.. ఆ మూడు వందలతో పాటు రూ. 100, చట్టాన్ని గౌరవించడం లేదనే కారణంతో మరో రూ.500 జరిమానా వేస్తారు.


వరంగల్ లో సరికొత్త టెక్నాలజీ
హన్మకొండ నగరంలో కొత్త టెక్నాలజీతో ట్రాఫిక్ రూల్స్ నియంత్రణ అమలు చేయనున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో 360 డిగ్రీల్లో ఫోటోలు తీసే టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించుకుంటున్నారు. దీంతో ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధపడుతున్నారు. హన్మకొండ నగరంలో ప్రధాన కూడళ్ళలో అధునాతన టెక్నాలజీతో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హెల్మెంట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్ , సిగ్నల్ జంప్, రాంగ్ రూట్, జిబ్రా లైన్ క్రాస్ కెమెరాల్లో రికార్డవుతోంది. దీని ఆధారంగా ఆటోమేటిగ్గా ఫైన్లు పడతాయి. ఇంటికే ఈ - చలానా వస్తుంది. కాబట్టి, నగర ప్రజలందరు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచించారు.