ది న్యూ యార్క్ టైమ్స్ అనే అమెరికాకు చెందిన వార్తా సంస్థ ప్రచురించిన ఓ కథనంపై కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏకంగా అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ వీధిలో బుల్డోజర్ పై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలతో అక్కడి పార్టీ అభిమానులు పరేడ్ నిర్వహించుకున్నారు. అయితే, దీన్ని న్యూ యార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. బుల్డోజర్ అనేది ఇండియాలో అణచివేతకు చిహ్నంగా మారిందని ఆ కథనంలో న్యూ యార్క్ టైమ్స్ రాసింది. 


‘‘బుల్డోజర్ భారతదేశంలో అణచివేతకు చిహ్నంగా మారింది. న్యూ జెర్సీ పరేడ్‌లో అది కనిపించడం వల్ల ఈ ప్రాంతంలోని హిందూ మరియు ముస్లిం వర్గాల మధ్య లోపాలను బహిర్గతం చేసింది’’ అని ది న్యూ యార్క్ టైమ్స్ ట్వీట్ చేసింది.


ఈ ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా పరువు పోయిందని అన్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయింది. 2022 కల్లా బుల్లెట్ ట్రైన్ తెస్తామని హామీ ఇచ్చారు. ఆఖరికి ఇలా బుల్డోజర్ డెలివరీ చేశారు’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.






విపక్షాలది అర్థం లేని వాదన - కేటీఆర్


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకులు విడుదలైన వేళ మంత్రి కేటీఆర్ విపక్షాల తీరును కూడా ప్రశ్నించారు. వారు అర్థం లేని మాటలు మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని అన్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటున్నా కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా స్పందించారు.


‘గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో మన రాష్ట్రానికి చెందిన మున్సిపాలిటీలు ఏకంగా 16 అవార్డులు గెలుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చే ఈ ర్యాంకుల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. అయినా తెలంగాణలోని విపక్షాలు, కేంద్ర పెద్దలు కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్నాయి. విపక్షాల లాజిక్ లేని మాటలు ఆశ్చరాన్ని కలిగిస్తున్నాయి’’ అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.






ఆర్థిక మంత్రిపైనా విమర్శలు


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తరచూ తెలంగాణ గురించి చేసే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో చెల్లిస్తున్న మొత్తాలను వెల్లడించారు. ‘‘మోదీ సర్కార్ రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని మన ఆర్థిక మంత్రి పాఠాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ నిజానిజాలు చూడండి. తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే ప్రతి రూపాయిలో కేవలం రూ.0.46 పైసలు మాత్రమే వెనక్కి వస్తోంది. మేడం.. ఒక బ్యానర్ పెట్టాల్సిన సమయం ఇది.’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


కేటీఆర్ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 2014-15 ఏడాది నుంచి 2020-21 ఏడాది వరకూ ఈ ఏడేళ్లలో తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో ఇవ్వగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,68,647 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.1,97,150 కోట్లు బ్యాలెన్స్ ఉంది’’ అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.