పండగ వచ్చిందంటే చాలు నగరాల్లో నివసించే వారు సొంతూరికి, పుట్టింటికి లేదా అత్తారింటికి వెళ్తుండడం సహజమే. ఇక సంక్రాంతి పండగైతే వేరే చెప్పాల్సిన పని లేదు. తెలుగువారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ప్రతిఒక్కరూ కుటుంబంతో కలిసి జరుపుకోవాలనే అనుకుంటారు. అందుకే ఏడాదిలో ఎప్పుడూ లేనంత రద్దీ సంక్రాంతి సమయంలో ఉంటుంది. అన్ని రకాల ప్రయాణ సాధనాలు కిక్కిరిసిపోతుంటాయి. ఇంకెంతో మంది సొంత వాహనాలు ఉన్నవారు అందులోనే వెళ్తుంటారు. అలా ఈ సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లిన ప్రైవేటు వాహనాల సంఖ్య విస్మయం కలిగిస్తోంది. 


విజయవాడ వైపుగా పంతంగి టోల్ గేట్ మీదుగా వెళ్లిన వాహనాల సంఖ్యను ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సంక్రాంతి పండుగ కోసం గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 1.24 లక్షల వాహనాలు వెళ్లినట్లుగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. జనవరి 12 గురువారం  56,500 వాహనాలు వెళ్లాయని, 13న 67,500 కార్లు వెళ్లినట్లు వివరించారు. పండుగల కోసం వెళ్తున్న వారిలో 90 శాతం మంది సొంత వాహనాల ద్వారానే వెళ్లినట్లు తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం 98 వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ మీదుగా విజయవాడ వెళ్లినట్లు గుర్తించారు. 


వరంగల్ వైపు 26 వేలు


హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బీబీ నగర్ టోల్ గేట్ మీదుగా నిన్న 26 వేల వాహనాలు వెళ్లాయని.. అందులో 18 వేల కార్లు ఉన్నాయని రాచకొండ పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు 13 వేలకు పైగా వాహనాలు వచ్చినట్లు స్పష్టం చేశారు.


పోలీసుల సూచనలు


హైవేలో టోల్ గేట్ల వద్ద వాహనాలను క్రమ పద్ధతిలో పంపించేందుకు జీఎంఆర్ సిబ్బంది సాయం తీసుకున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, సొంత వాహనాలకు తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. టికెట్లు దొరకలేదని గూడ్స్ వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని సూచించారు. కమర్షియల్ డ్రైవర్లు సైతం కారు లేదా వాహనం కండీషన్‌ను పరిశీలించుకున్న తర్వాతే రోడ్డుపైకి రావాలని నిర్దేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.


ఇంత పెద్ద మొత్తంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎల్బీ నగర్, ఉప్పల్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక సిబ్బంది సాయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.