Sandhya theatre Stampede Incident | హైదరాబాద్: ఐకాన్ స్టార్, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించారు అల్లు అర్జున్. న్యాయమూర్తికి పూచీకత్తు సమర్పించిన అనంతరం పుష్ప2 హీరో కోర్టు నుంచి తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు. నిన్న బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టులో రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని నటుడ్ని ఆదేశించింది. కేసులో సాక్షులను, బాధితులను ప్రభావితం చేయవద్దని సూచించింది. బెయిల్ సమయంలో కోర్టు ఆదేశాల ప్రకారం రెండు నెలలపాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది.
గతంలో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. నాంపల్లి కోర్టులో రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరఫు లాయర్లు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పు జనవరి 3కి వాయిదా వేయడం తెలిసిందే. అల్లు అర్జున్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తే నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌ను కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడానికి అల్లు అర్జున్ శనివారం నాడు మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట
డిసెంబర్ 4న ఫుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సంందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత అల్లు అర్జున్ ను ఏ11గా కేసులో చేర్చారు. వారం రోజుల తర్వాత అల్లు అర్జున్ ను ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేసిన రోజునే హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించింది. గత వారం అల్లు అర్జున్ లాయర్లు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. వాదనలు కూడా పూర్తయిన తర్వాత తీర్పును జనవరి 3కి రిజర్వ్ చేశారు. శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేస్తూ నటుడికి నాంపల్లి కోర్టు ఊరట కలిగించింది.
ఇక వివాదం ముగిసినట్లేనా
అల్లు అర్జున్ వ్యవహారంతో సినీ పరిశ్రమను రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అల్లు అర్జున్ వ్యవహారశైలిపై సైతం అదే రీతిలో విమర్శలు వచ్చాయి. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి బృందాన్ని సినీ ప్రముఖులు కలవడంతో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని అంతా భావించారు. తొక్కిసలాటలో నష్టపోయిన కుటుంబానికి పుష్ప 2 టీం రూ. 2 కోట్లు ఇచ్చింది. కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో వివాదం కాస్త సద్దు మణిగింది.