Telangana News: దేశంలో బీజేపీని గెలిపించాలని 140 కోట్ల మంది ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు బీజేపీ మార్గం చూపిందని అన్నారు. దేశాన్ని లూటీ చేయడం, వారసత్వ రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు.


తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఒకే మాట వినిపిస్తోందని మోదీ అన్నారు. బీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ వద్దు.. ఏఐఎంఐఎం వద్దు అని తెలంగాణ ప్రజలు అంటున్నారని మోదీ మాట్లాడారు. బీజేపీకే ఓటేస్తామని తెలంగాణ ప్రజలు అంటున్నారని అన్నారు. జూన్ 4న దేశం గెలుస్తుందని.. 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 4న త్రిపుల్ తలాఖ్, సీఏఏ, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఓడిపోక తప్పదని మోదీ అన్నారు.


భారత దేశం అన్నిరంగాల్లో ఇప్పుడు పవన్ ఫుల్ గా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ పవర్.. వింటెక్ పవర్.. స్టార్టప్ పవర్.. గా దేశం ఉందని అన్నారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ గల ఐదో దేశం భారత్ అని మోదీ గుర్తు చేశారు. ఇవాళ అద్భుతమైన అంతరిక్ష బలాన్ని మనం కలిగి ఉన్నామని.. ఇది మోదీ ట్రాక్ రికార్డ్ అని ప్రధాని అన్నారు. కానీ, కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ మాత్రం లూటీ చేయడమే అని అన్నారు.


‘‘12 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా.. దేశ వ్యాప్తంగా ఇలాంటి వార్తలే వినిపించేవి. కుటుంబం సరదాగా రెస్టారెంట్ కి వెళ్లినా, సినిమా థియేటర్ కి వెళ్లినా, బస్సులో వెళ్తున్నా బాంబు పేలుళ్ల ఘటనలు జరిగాయి. ఎక్కడికి వెళ్లాలన్నా భయపడేవాళ్లు. ఇప్పుడు ఇలాంటి వార్తలు వింటున్నామా? ఈ బాంబ్ బ్లాస్ట్ లు ఎవరు ఆపారు? ఈ బాంబ్ బ్లాస్ట్ లు ఘనత మాది’’ అని  మెదీ అన్నారు.