Hyderabad News: మహారాష్ట్రలోని అమ్రావతి ఎంపీ, బీజేపీ నేత, సినీ నటి నవనీత్ కౌర్ (Navneet Kaur)పై తెలంగాణలో (Telangana) కేసు నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇటీవల షాద్ నగర్ లో పర్యటించారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఆమెతో కలిసి పట్టణంలోని కార్నర్ మీటింగ్ లో నవనీత్ కౌర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఎన్నికల అధికారి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు షాద్ నగర్ సీఐ తెలిపారు.
ఎంఐఎంపైనా ఘాటు వ్యాఖ్యలు
మరోవైపు, ఈ నెల 8వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున సైతం నవనీత్ కౌర్ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనూ ఆమె ఎంఐఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అక్బరుద్దీన్ పదేళ్ల కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నవనీత్ కౌర్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. 2013లో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆమె.. 15 నిమిషాలు కాదు… కేవలం 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో… మళ్లీ ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మరో పాకిస్థాన్ కాకుండా బీజేపీ అభ్యర్థి మాధవీలత అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అసదుద్దీన్ కౌంటర్
అటు, నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. 'మీరు 15 సెకండ్లు అడుగుతున్నారు... ప్రధాని మోదీని ఒకటి అడుగుతున్నాను, గంట సమయం ఇవ్వండని కోరుతున్నానన్నారు. అప్పుడు మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఎవరు భయపడేవాళ్లు ఉన్నారు? మేం సిద్ధంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మీవారు... ప్రభుత్వం మీది... ఆరెస్సెస్ మీది... ఎవరు ఆపుతున్నారు... ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను.' అని సవాల్ చేశారు. ఏం చేస్తారో చేయండన్నారు.
నవనీత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని AIMIM డిమాండ్ చేసింది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు.
Also Read: Viral News: ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి, రాహుల్- ఉచిత ప్రయాణంపై మహిళలతో మాటామంతి,