Political Parties Trying To Woo Voters In Chittor: ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది ఓటు. ఐదేళ్లకోసారి తమకు నచ్చిన.. తాము మెచ్చిన నాయకుడికి జనం ఓట్లేసి గెలిపించి అధికారం అప్పగిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు నానా పాట్లు పడుతుంటారు. తాము అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల వర్షం గుప్పిస్తుంటారు. అలాగే, పోలింగ్ సమయంలో ఓటర్లకు డబ్బులు పంచేందుకు కూడా వెనుకాడరు. ఉమ్మడి చిత్తూరు (Chittor) జిల్లాలో వివిధ పార్టీల నేతలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బు, వస్తువులు, మద్యం ఇలాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా వైసీపీ, మరో వైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో హోరాహోరీ పోటీ నెలకొనగా.. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు శతవిధాలా నేతలు ప్రయత్నిస్తున్నారు. 


ప్రలోభాలకు తెర లేపారా.?


రాష్ట్రంలో మే 13న (సోమవారం) పోలింగ్ జరగనున్న తరుణంలో ఎన్నికల ప్రచారం 11వ తేదీ (శనివారం)  రాత్రికే పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. అయితే, ప్రచారం ముగిసే లోపు ప్రలోభాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని ఆయా పార్టీల నాయకులు కింద స్ధాయి క్యాడెర్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల వారీగా వారికి నగదు పంపిణీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. 


పట్టణాలపై తొలుత దృష్టి


ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో తొలుత డబ్బు పంపిణీ చేసే కార్యక్రమానికి పార్టీల నాయకులు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ప్రదానంగా ప్రచార ముసుగులో డబ్బు పంపిణీ జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు అక్కడి పరిస్థితిని బట్టి పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 11 నుంచి 12 లోపు పంపిణీ చేసేలా ఇప్పటికే కార్యాచరణ సైతం ముగిసిందని కొందరు నాయకులు చెబుతున్న మాట.


తనిఖీలు జరుగుతున్నాయా.?


ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనల ప్రకారం ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా రూ.50 వేలకు మించి ఎవరి వద్ద అయినా ఉంటే అందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఆధారాలు లేకపోతే పోలీసులు ఆ నగదు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ వారికి అప్పగించాలి. సంబంధిత వ్యక్తి ఆధారాలు చూపించకపోతే కేసు నమోదు చేస్తారు. ఇందుకు రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు, పట్టణాల సరిహద్దుల్లో పోలీస్, సెబ్ ఇతర విభాగాల అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయని.. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తే డబ్బు సీజ్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే,  ఇంతమంది ఓటర్లకు పంచేందుకు స్థానిక నేతలకు డబ్బు ఎలా వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ఎవరిదగ్గరైనా ఇంత డబ్బు ఉంటే తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంకా తనిఖీలు విస్తృతం చేసి ఓటర్లుకు ప్రలోభాలను అడ్డుకోవాలని పలువురు ఎన్నికల అధికారులను కోరుతున్నారు.


Also Read: Andhra Pradesh News: లోకేష్‌ అడ్డాలో సీఎం జగన్ భారీ సభ- 57 నెలలకే ప్రభుత్వం గొంతు పిసికేస్తున్నారని ఆవేదన