Hyderabad News: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జనజాతర సభ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆర్టీసీ బస్‌లో ప్రయాణం చేశారు. మహిళలు, యువతతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్‌ ప్రయాణంపై  ఆరా తీశారు. 


బస్‌లో కొద్ది దూరం ట్రావెల్ చేసిన రేవంత్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన ఇతర పథకాలపై కూడా మాట్లాడారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌లో సిటీ బస్ ఎక్కిన రాహుల్, రేవంత్... అందులో ఉన్న ప్రయాణికులకు మేనిఫెస్టో ప్రతులు పంపిణీ చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్థిక సాయంతోపాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. 






అంతకు ముందు సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే... రాహుల్ గాంధీ  వీడియో తీశారు. ఈ వీడియో కూడా వైరల్‌గా మారుతుంది. 






సరూర్‌ నగర్ సభలో పాల్గొన్న రాహుల్, రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. ప్రజల బాగు కోసం, దేశాభివృద్ధి కోసం మేనిఫెస్టో రూపొందించినట్టు పేర్కొన్నారు అందులో ఉన్న ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం చాలా గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అవి దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కచ్చితంగా ఇండి కూటమి అధికారంలోకి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
బీజేపీ గెలిస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆరోపించారు రాహుల్ గాంధీ. అందుకే నాలుగు వందల సీట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్చను ఇవ్వబోరని అదానీ, అంబానీలు చెప్పినట్టే అంతా నడుస్తోందని వాళ్ల కోసమే మోదీ పని చేస్తున్నారని విమర్శుల చేశారు.