సెప్టెంబరు 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌ పర్యటన ఉన్న వేళ, నగరంలో రాత్రికి రాత్రి అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అర్ధరాత్రి ఈ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల గోడలకు పోస్టర్లు కనిపించాయి. కంటోన్మెంట్ యువత పేరుతో ఈ పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు.


ఆ పోస్టర్లను టీఆర్ఎస్ నేతలు అంటించినట్లుగా భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా అందులో విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పుకోవాలంటూ కొన్ని పోస్టర్లలో ఉంది. అమిత్ షా సభను ఉద్దేశించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లే అంటూ ఇంకా కొన్ని పోస్టర్లలో ఉంది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలు పోస్టర్లల ప్రచురించారు.


హైదరాబాద్ కు అమిత్ షా
సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. ఆ వేడుక పరేడ్ గ్రౌండ్ లోనే జరగనుంది. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన ఉంటుంది. 16న అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. కాగా, 16వ తేదీ సాయంత్రం ఇటీవల చనిపోయిన కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ సందర్భంగా నటుడు ప్రభాష్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. 


ఇటీవల మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నిఖిల్ తో సమావేశం అయ్యారు.


బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రారంభించిన కిషన్ రెడ్డి (Kishan Reddy)



బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పెరెడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ సాగనుంది. కేంద్ర మంత్రి స్వయంగా బైక్ నడిపి ర్యాలీని ప్రారంభించారు. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళలు ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. అమృత మహోత్సవాల్లో భాగంగా పార్టీ తరపున వివిధ కార్యక్రమాలు బీజేపీ నిర్వహిస్తోంది.