KTR Tweet: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. ఓవైపు విశ్వగురు ఉచితాలు వద్దని చెబుతుంటే.. మరోవైపు జోకర్ ఎంపీ (బండి సంజయ్ ను ఉద్దేశించి) ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు ఇస్తామని హామీలు చేస్తున్నారని అన్నారు. దేశాన్ని పాలిస్తుంది బీజేపీయేనా కాదా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దేశ వ్యాప్తంగా ఓ సరైన నిర్ణయం తీసుకునే సత్తా లేదా అని నిలదీశారు. దేశం మొత్తానికి ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు ఇచ్చేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 






నాలుగో విడత పాదయాత్రలో భాగంగా బండి సంజయ్.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో పర్యటించారు. ఈ క్రమంలోనే కాలనీ వాసులు బండి సంజయ్ కు తమ సమస్యలు తెలిపారు. స్పందించిన ఎంపీ.. పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచిత వైద్యం, విద్య, ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. 


మొన్నటికి మొన్న పౌష్టికాహారంపై కామెంట్లు..! 
ఛాన్స్ దొరికితే చాలు కేంద్రం, బీజేపీపై సెటైర్లతో విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ... పౌష్టికాహార లోపంపై మాట్లాడుతూ... భోజనం అనడానికి బదులు భజన అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ టెలిప్రాంప్టర్‌లో తప్పు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి టైంలో పౌష్టికాహారం లోపంపై దృష్టి పెట్టాలని సూచించారు.  అదే టైంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన ట్వీట్‌కు కూడా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ స్పందించారు. గౌతమ్ అదానీ సంపదన పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ భారత్‌ అభివృద్ధి చెందడం లేదని ఎవరు అంటారని అని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రశ్నించారు.  నాగేశ్వర్‌ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్... పొరపాటున ఆ ఒక్క అకౌంట్లోనే మొత్తం  డబ్బులు పడ్డాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి పేద భారతీయుడికి వాగ్దానం చేసిన 15 లక్షల రూపాయలు మొత్తం ఆ ఖాతాలోనే పడ్డాయోమో... పొరపాటున తప్పు జరిగిందా మోదీజీ అని ట్వీట్ చేశారు.