PM Modi Hyderabad Visit: : ఏప్రిల్ 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణలో ఎప్పుడు ఎంటర్ అవుతారు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఎప్పుడు చేరుకుంరా, తిరిగి ఎప్పుడు వెళ్తారు వంటి వివరాల షెడ్యూల్ వచ్చేసింది. 




ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.35కు రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరతారు. ఉదయం 11.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. 11.45 నుంచి 11.47 వరకు రైల్వే అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. 11.47 నుంచి 11.55 వరకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఫస్ట్ కోచ్ ను పరిశీలిస్తారు. అదే కోచ్ లో ఉండనున్న చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించనున్నారు. 11.55 నుండి 12 గంటల మధ్యలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. 


అనంతరం 12.15 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. 12.18 గంటలకు వేదికపైగా చేరుకుంటారు. అనంతరం కేంద్రమంత్రులు, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ప్రధాని మోదీని సత్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మాట్లాడతారు. అనంతరం 12.37 నుండి 12.41 గంటల మధ్యలో పలు రహదారి ప్రాజెక్టులను వేదికపై నుండే శంకుస్థాపన చేస్తారు. అనంతరం బీబీ నగర్ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులకు, సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్యలో డబులింగ్ పనులతో పాటు విద్యుత్ పనులకు, సికింద్రాబాద్ - మేడ్చల్ మధ్యలో ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తారు. 12.50 నుండి 1.20 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. 1.20 గంటలకు పరేడ్ మైదానం నుండి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయల్దేరతారు. 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి విమానంలో తిరుగు పయనమవుతారు.


కేంద్ర బలగాల ప్రత్యేక నిఘా..!


రేపు ప్రధాని హైదరాబాద్ కు రాబోతున్న క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా కేంద్ర బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్పీజీ, ఎన్ఎస్జీ, డీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ మొదలైన కేంద్ర బలగాలు పెద్దఎత్తున చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రైల్వే స్టేషన్ వెనుకవైపు నుండి ఎవరిని అనుమతించడం లేదు. ప్రయాణికులను కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు వైపు నుండే లోనికి రావాలని సూచిస్తున్నారు. ప్రధాని రాక సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే శనివారం నాడు 10వ ప్లాట్ ఫాం, ట్రాక్ పై నుండి నడపాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కాబట్టి ప్రయాణికులు తాము ప్రయాణించే రైళ్లకు సంబంధించిన సమాచారం తెలుసుకొని స్టేషన్ కు చేరుకోవాలని, అంతే కాకుండా ఇబ్బందులను ముందే గ్రహించి స్టేషన్ కు కనీసం ఒక గంట ముందు చేరుకోవాలని సూచించారు. అలాగే తాము ప్రయాణం చేయాల్సిన రైలులో వీలైనంత త్వరగా ఎక్కి కూర్చోవడం ద్వారా సంతృప్తికరమైన ప్రయాణ అనుభూతిని పొందాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.