Pakistan Cricket Team Arrived Hyderabad:


పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు భారత్ లో అడుగుపెట్టింది. వన్డే వరల్డ్ ఆడేందుకు పాక్ క్రికెట్ టీమ్ హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బాబర్ అజామ్ సేన బుధవారం రాత్రి భాగ్యనగరానికి వచ్చింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు దాయాది జట్లు ఆటగాళ్లు హైదరాబాద్ వచ్చారు. అయితే గత ఏడేళ్లలో పాక్ జట్టు భారత్ కు రావడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శంషాబాద్ చేరుకున్న ఆటగాళ్లను పటిష్ట భద్రత మధ్య నగరానికి తీసుకొచ్చారు పోలీసులు, భద్రతా సిబ్బంది. గణేష్ నిమజ్జనం సైతం ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉప్పల్ వార్మప్ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు.


వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 29న నగరంలోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు వార్మప్ మ్యాచ్ ఆడనున్నాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రేక్షకులు లేకుండానే ఉప్పల్ లో మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. పాక్ జట్టు చివరగా 2016లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ లో పర్యటించింది. ఆ తరువాత దాయాది జట్టు ఆటగాళ్లు భారత్ కు రావడం ఇదే తొలిసారి.


వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పాక్ టీమ్ మొదట న్యూజిలాండ్ తో ఈ 29న వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతోనో మరో వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తొలి మ్యాచ్ హైదరాబాద్‌ వేదికగా అక్టోబరు 6న నెదర్లాండ్స్‌తో జరగనుంది. దాయాది జట్లు, చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్ మ్యాచ్ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్ 14న జరగనుంది.






మెగా టోర్నీ వన్డే ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పాక్ క్రికెట్ టీమ్ ను చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ ఇటీవల ప్రకటించారు. ఆసియా కప్‌లో గాయపడిన స్టార్ పేసర్ నసీమ్ షాను తప్పించారు. అతడితో పాటు ఆసియా కప్ ఆడిన బౌలర్లు ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ హస్నన్ లను జట్టులో లేరు. 


పాక్ జట్టు జాబితా: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హ్యారిస్ రౌఫ్,  హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, ఇమాముల్ హక్, మహ్మద్ వసీమ్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్ షకీల్, షాహిన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్.


రిజర్వ్ ఆటగాళ్లుగా మహ్మద్ హారిస్, అబ్రార్ అహ్మద్, జమాన్ ఖాన్ ఉన్నారని పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇదివరకే ప్రకటించారు.