ఏడాది క్రితం నాటికి ఇప్పటికీ ట్యాంక్ బండ్ అందాలు ఏ స్థాయిలో మారాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నగర వాసులు ఆదివారం పూట చల్లటిగాలి పీల్చుకుంటూ సేద తీరేందుకు ట్యాంక్ బండ్‌ను ఎంతో సౌకర్యంగా ప్రభుత్వం తీర్చి దిద్దింది. ఇప్పటికే కొద్ది వారాల క్రితం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్‌ను ట్యాంక్ బండ్‌పై పూర్తిగా నిషేధించారు. దీంతో ఉల్లాసంగా జనం సాయంత్రం వేళలో ట్యాంక్ బండ్‌పై గడుపుతున్నారు. దీనికి నగర వాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, ఈ సమయంలో పర్యటకులకు మరింత జోష్ కల్పించేలా జీహెచ్ఎంసీ మార్పులు చేసింది.


ఆదివారం నాడు ట్యాంక్‌బండ్ వ‌ద్దకు వ‌చ్చి కాల‌క్షేపం చేసే వారి కోసం పిల్లల‌కు సంబంధించిన మ‌రిన్ని వినోద కార్యక్రమాల‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. క‌ళ‌లు, హ‌స్తక‌ళ‌ల‌కు సంబంధించిన స్టాల్స్‌తో పాటు సంగీత కార్యక్రమాల‌ను నిర్వహించ‌బోతున్నారు. ఇందుకోసం స్పీకర్ల ద్వారా సంగీతాన్ని ప్లే చేయనున్నారు. హైద‌రాబాద్ రుచుల‌ను చూసేందుకు ప్రత్యేకంగా ఫుడ్ ట్రక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, హుస్సేన్ సాగ‌ర్‌పై లేజ‌ర్ షోతో పాటు ట్యాంక్‌బండ్‌పై అన్ని వైపులా ప్రేక్షకుల గ్యాల‌రీలు ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక‌ ప్రధాన కార్యద‌ర్శి అర‌వింద్ కుమార్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ట్యాంక్‌బండ్‌పై ఈ సండేను మ‌రింత ఫ‌న్‌డే గా మార్చుకోవాలని ట్వీట్ చేశారు.


హైదరాబాద్‌ నగరానికి ట్యాంక్‌ బండ్‌ ఒక మణిహారం. అలాంటి ట్యాంక్‌ బండ్‌ అత్యాధునిక హంగులతో, వారసత్వ శోభను సంతరించుకొని నగర వాసులను, పర్యటకులను ఆహ్లాదపరిచ్చేందుకు సిద్ధమైంది. ట్యాంక్‌ బండ్‌ సుందరీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సుమారు రూ.27 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటికే 90 శాతం సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. సుందరీకరణలో భాగంగా ఇరువైపులా ఫుట్‌పాత్‌లను పూర్తిగా తొలగించి, ఆధునీకరించారు. ఎంతో విశాలంగా ఉన్న ట్యాంక్‌ బండ్‌పై గ్రానైట్‌ రాళ్లతో ఫుట్‌పాత్‌లను తీర్చిదిద్దారు. విద్యుత్ స్తంభాలను ప్రత్యేక డిజైన్లతో ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ గ్రిల్స్‌ను కూడా మార్చారు. దీంతో ట్యాంక్ బండ్ మొత్తం లండన్ స్ట్రీట్‌ను తలపిస్తోంది.


ట్యాంక్ బండ్ వద్ద పీవీసీ పైపులను, వరద నీటి పైపు లైను వ్యవస్థను భూగర్భంలోంచి వేశారు. ట్యాంక్‌ బండ్‌ గట్టిగా ఉండేందుకు క్రషర్‌ సాండ్‌తో పీసీసీ, స్లాబ్‌ రీఎన్‌ఫోర్స్‌మెంట్‌ చేశారు. 25-30 ఎంఎం మందంతో గ్రానైట్‌ రాళ్లను ప్లేమ్‌ ఫినిష్డ్‌ ఉపరితలంలో వేశారు. ఏటా గణేశ్‌ ఉత్సవాల సమయంలో విగ్రహాల నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసే క్రేన్‌ల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేశారు. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఫుట్‌పాత్‌ ఆధునీకరణ పనులకు మొత్తం రూ.14.50 కోట్లను ఖర్చు చేయగా, రూ.12.50 కోట్లతో హేరిటైజ్‌ శైలిలో విద్యుత్‌ దీపాలంకరణను చేపట్టారు. 


వర్షాకాలంలో వర్షపు నీరు ట్యాంక్‌ బండ్‌ రోడ్డుపై నిల్వకుండా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ విన్యాసాలు, బోటింగ్‌లో తిరిగే వారిని వీక్షించడంతో పాటు బుద్ధ విగ్రహాన్ని నగరవాసులు వీక్షిస్తూ ఆహ్లాదకరమైన వాతావారణాన్ని అస్వాదించేలా ఏర్పాట్లు ఉన్నాయి.