సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఆ లేఖను తన ట్విటర్ ఖాతాలో ఉంచారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లేఖ ద్వారా బండి సంజయ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేయించాలని, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి.. కేంద్రం ఆర్థిక సహాయంతో నిర్మాణం చేపట్టాలని కోరారు. రజాకార్ల చేతిలో బలైన కుటుంబాలకు ప్రభుత్వం సన్మానం చేయాలని సూచించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పాఠంగా చేర్చాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.


‘‘సెప్టెంబరు 17.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారమైన రోజు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పర్వదినమైన తెలంగాణ విమోచన కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరం. ఎంఐఎం కనుసైగల్లో కొనసాగుతున్న మీ ప్రభుత్వం వారికి ఎక్కడ కోపం వస్తుందనే భయంతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా నాలుగు కోట్ల ప్రజలు మనోభావాలను దెబ్బతీస్తున్నారు.


తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17న సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంత ప్రాధాన్యత గల తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెలుగు దేశం, ప్రస్తుతం పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోవడంతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెలు గాయపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కనీసం ఇప్పటికైనా నిర్వహించాలని కోరడానికే బీజేపీ తెలంగాణ శాఖ తరపున మీకు ఈ లేఖను రాయడం జరుగుతోంది.


మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు నిర్వహించలేరని మీరు, టీఆర్ఎస్ పార్టీ ఊరూ, వాడా ప్రచారం చేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు కావొస్తుంది. ఈ ఏడు సంవత్సరాల్లో మీకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే సోయే లేదు. రజాకార్లు, ఖాసీం రజ్వీ వారసులైన మజ్లిస్ పార్టీ నేతలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా మీరు కానీ, మీ పార్టీ వారు కానీ చేయడం లేదు. ఇదే సందర్భంలో మీకు మరొక్క విషయాన్ని గుర్తు చేయదల్చుకున్నాను. మొదటిదశ, మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మజ్లిస్ పాత్ర నామమాత్రమే. వాస్తవానికి వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడాన్ని వ్యతిరేకించారు.’’ అని బండి సంజయ్ లేఖ రాశారు.