Union Minister Kishan Reddy | హైదరాబాద్: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 6,280కోట్లు ఖర్చు చేసిందని, ఉత్తర ప్రాంత రీజినల్‌రింగ్ రోడ్డు(Hyderabad Regional Ring Road) నిర్మాణానికి రూ. 18,772 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాష్ర్ట ప్రభుత్వం భూములు అందజేయడంలో జాప్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ ఆఫీసులో జాతీయ రహదారులు, కనెక్టివిటీలకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకాలేదు. కానీ రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకారాన్ని కిషన్ రెడ్డి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులు 95 శాతం పూర్తవుతున్నా, తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్అక్విజేషన్ద్వారా ఇవ్వాల్సిన భూమిని అందించకపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి ఈ విషయంపై తీసుకువెళ్లామని, మరోమారు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో 10 జాతీయ రహదారులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని.. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభానికి రానున్నారని తెలిపారు.
కనెక్టివిటీ పెంచేలా రహదారుల నిర్మాణం
‘ఎన్‌హెచ్ 44, 565, 65, 167, 202, 365ఎ, రూ.61 వేల కోట్లతో తెలంగాణ సరిహద్దు ప్రాంతాలను ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీని పెంచే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. పలు చోట్ల రాష్ర్ట ప్రభుత్వం భూములు అందించకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. హైదరాబాద్ లోని ఆరాంఘర్ నుంచి శంషాబాద్ (Shamshabad) వరకు ఆరులేన్ల విస్తరణ రూ. 300 కోట్లతో పూర్తయ్యింది. హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రజలకు సిగ్నల్స్ ఫ్రీగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశాం. అంబర్పేట్ ఫ్లై ఓవర్ కింద రోడ్డు నిర్మాణం కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం, రాష్ర్ట ప్రభుత్వం భూమిని అప్పగిస్తే పనులు మొదలు పెడతాం. హైదరాబాద్–పూణే, మహబూబ్ నగర్– జడ్చర్ల, మిర్యాలగుడ, మహబూబ్ నగర్–చించోలి, మహబూబ్ నగర్–కల్వకుర్తి, కోదాడ–ఖమ్మం, నకిరేకల్–నాగార్జునసాగర్, నిర్మల్ ఖానాపూర్, మంచిర్యాల – రేపల్లెవాడ లాంటి పనులు జాతీయ రహదారి పనులు పూర్తి కావచ్చాయని’ కిషన్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్హయాంలోనే తెలంగాణకు రూ. 7.50 లక్షల కోట్ల అప్పు ఉందని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడేమో తనకు ఇంత అప్పు ఉందని తెలియదని చెప్పడం ఏంటని నిలదీశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది.. కానీ సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, రేవంత్ ఇచ్చిన హామీలతో తమకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీపై అసత్యాలు, హామీలపై దాటవేత ధోరణి, అప్పులపై ఏడుపులు, భాషపై అబద్ధాలు ఆ పార్టీ నేతల విధానమని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఒక్క ఎంపీ సీటు తగ్గదు..
నియోజకవర్గాల పునర్ విభజనపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గానీ, దక్షిణ భారతదేశంలో గానీ ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు. తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంట్సీట్లు తగ్గబోవు. ప్రధాని మోదీ లోక్‌సభలో ఈ విషయాన్ని చెప్పారు. దక్షిణాదిన ఎంపీ సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్, రేవంత్ రెడ్డిలు మాట్లాడేవన్నీ బోగస్ మాటలే. జనాభా సేకరణ, రీ ఆర్గనైజేషన్కమిటీ ఏర్పాటు చేసిన తరువాత మార్గదర్శకాలు విడుదలవుతాయి. త్వరలో ఎన్నికలు రానుండడంతో తమిళనాడును దోచుకున్న స్టాలిన్ కుటుంబం ఓట్ల కోసం అసత్యాలను ప్రచారం చేస్తుంది. ప్రజలకు ఏం చేశారో చెప్పడానికి బదులు హిందీ భాషకు రంగులు వేయాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గుజరాత్, తమిళ కాశీ, తెలుగు, తమిళ సంఘాన్ని ఏర్పాటు చేశాం. కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టాం. హిందీదీ నేర్చుకోవాలని ఏ ఒక్కరినీ కేంద్రం బలవంత పెట్టలేదని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ పై చేతులెత్తేశారు..
రిజినల్రింగ్ రోడ్డు (Hyderabad RRR)కు కూడా కేవలం రూ. 100 కోట్లు మాత్రమే డిపాజిట్చేశారని, డబ్బులు లేవని తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. పనులు ఆగవద్దని తాను కేంద్రాన్ని కోరానని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు తొలిసారి ఈ విషయాన్ని అందరికీ తెలిపా అన్నారు. ఎంఎంటీఎస్ (MMTS)కు తెలంగాణ ప్రభుత్వం రూ. 1200 కోట్లు కేటాయించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రెండేళ్లు మూలన పడిన ప్రాజెక్టు ప్రారంభించేలా చొరవ తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కు తగ్గేది లేదని మా నిర్ణయాలతో రుజువైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Telangana Latest News: మహిళా సంఘాలకు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి