హైద‌రాబాద్ : నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (NIMS) విస్తరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. నిమ్స్ విస్తర‌ణ‌కు రూ. 1,571 కోట్ల నిధుల‌ను కేటాయిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ ఆసుపత్రి రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లకు సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో నిమ్స్ విస్తర‌ణ‌కు తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. ఇందులో భాగంగా తాజాగా నిధుల‌ను కేటాయిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


10 వేల సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి..
రాష్ట్రంలో 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. తాజాగా 2000 పడకల నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు లభించాయి. ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రిలో 1800 పడకలు ఉండగా.. 4 వేల పడకలతో నగరం నలువైపులా నాలుగు టిమ్స్, వరంగల్ లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నాయి. తాజాగా ఇచ్చిన విస్తరణ అనుమతులతో మొత్తం 10,000 వేలకు చేరువగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రలు పడకలు ఉంటాయి. నిమ్స్ విస్తరణలో భాగంగా మరికొన్ని పడకల విస్తరణ చేయనుండగా... ఇందులో 500 ఐ సి యూ బెడ్స్, మొత్తం 42 విభాగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలతో సూపర్ స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ హెల్త్ సైన్సెస్ ట్రైనింగ్ అందుబాటులోకి రానున్నాయి.






వైద్య సేవలు మరింతగా పెంచేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నిధులు అందిస్తోంది. ఈ క్రమంలో నిమ్స్ విస్తర‌ణ‌కు తెలంగాణ ప్రభుత్వం బుధవారం రూ. 1,571 కోట్ల నిధులు కేటాయించ‌డంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు హ‌ర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో ఈ నిర్ణ‌యం మ‌రో ముంద‌డుగు ఈ మేర‌కు మంత్రి హరీష్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆరోగ్య రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నామ‌ని తన ట్వీట్‌లో మంత్రి హరీష్ పేర్కొన్నారు. 


నిమ్స్‌ ఆస్పత్రిలో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌తోపాటు 200 పడకల ఐసీయూ, వెంటిలేటర్లు, ఇతర సౌకర్యాలను 2022 జూన్ 23న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు ప్రారంభించారు.