అసఫ్ జాహీ వంశంలో ఎనిమిదో నిజాం అయిన మీర్ బర్ఖత్ అలీ ఖాన్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అసఫ్‌ జాహీ వంశం తొమ్మిదో నిజాంగా నవాబ్‌ రౌనఖ్‌ యార్‌ ఖాన్‌ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి మజ్లిస్‌ - ఎ - షబ్జాదేగన్‌ సొసైటీ ప్రతినిధులు శనివారం (ఫిబ్రవరి 11) ప్రకటించారు. ఎనిమిదో నిజాం నవాబ్‌ మీర్‌ బర్ఖత్‌ అలీఖాన్‌ చనిపోయిన తర్వాత తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం తొమ్మిదో నిజాంను ఎంపిక చేశామని వారు చెప్పారు. హైదరాబాద్ అమీర్‌ పేట్ సమీపంలోని గ్రీన్ ల్యాండ్స్ ప్రాంతంలో ఉన్న మ్యారీగోల్డ్‌ హోటల్‌లో శనివారం వీరు విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు షెహజాదా మీర్‌ ముజ్తాబా అలీఖాన్, ఉపాధ్యక్షుడు మీర్‌ నిజాముద్దీన్‌ అలీ­ఖాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ మొయిజుద్దీన్‌ ఖాన్‌ వివరాలను వెల్లడించారు. 4,500 మంది నిజాం కుటుంబ సభ్యులతో కూడిన సొసైటీ పక్షాన తమ సమస్యలను ప్రభుత్వానికి సమర్థంగా వివరించగలరు అనే  విశ్వాసంతో తొమ్మిదో నిజాంగా నవాబ్‌ రౌనఖ్‌ యార్‌ఖాన్‌ను ఎంపిక చేసుకున్నామని వారు తెలిపారు. 


విదేశాల్లో ఉంటున్న నిజాం వారసులను కాకుండా స్థానికంగా ఉంటున్న వారసుడిని ఎంపిక చేశామని తెలిపారు. అలాగైతేనే తమ ప్రయోజనాలను కాపాడగలుగుతారని చెప్పారు. అందుకే రౌనఖ్ యార్ ఖాన్ ను తమ కుటుంబ పెద్దగా తాము ప్రకటించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అసఫ్‌ జాహీ వంశపారపర్యంగా వస్తున్న వస్తువులను సమావేశంలో ప్రదర్శించారు. వీటిని తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టే సమయంలో నవాబ్‌ రౌనఖ్‌ యార్‌ ఖాన్‌కు అందజేస్తారు.


నిజాం వంశస్తులు ఇప్పటివరకు మూడు చేతి కర్రలను భద్రంగా ఉంచుతూ ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే నిజాంకు ఆ చేతి కర్రలు అందిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. రూ.లక్షల విలువచేసే చేతి కర్రలు అసఫ్‌ జాహీల వంశపారంపర్యంగా వస్తున్నాయి. ఇందులో ఒకటి మొదటి నిజాం ప్రత్యేకంగా తయారుచేయించుకున్నారు. నాణ్యమైన చెక్కతో ఫిరోజ్‌ - హుస్సేనీ డైమండ్‌ పొదిగిన ఈ చేతి కర్ర ప్రస్తుత విలువ అక్షరాలా రూ.30 లక్షల దాకా ఉంటుంది. పైభాగంలో గుండ్రని నోబ్‌ కలిగి చుట్టూరా 5 బ్రాస్‌ లైన్లతో ఉంటుంది. మరొకటి టిప్పు సుల్తాన్‌ నుంచి నిజాం రాజులు పొందారు. రోజ్‌ వుడ్‌తో వివిధ రకాల డిజైన్లతో దీనిని రూపొందించారు. దీని విలువ కూడా 30 లక్షల దాకా ఉంటుంది. ఇంకో చేతికర్ర తాజ్‌మహల్‌ సృష్టికర్త షాజహాన్‌న్‌ నుంచి వీరు పొందారు. ఇది ఏనుగు దంతంతో తయారు చేసినది. ఈ పురాతన చేతి కర్ర రేటు రూ.15 లక్షలు ఉంటుందని సొసైటీ ప్రతినిధులు చెప్పారు.


గతంలో 9వ నిజాంగా ఇంకొకరి పేరు ప్రకటన


అయితే, 9వ నిజాంగా ఇటీవల కన్నుమూసిన 8వ నిజాం కుమారుడు అజ్మత్‌ ఝాను గతంలో ప్రకటించడం సరికాదని అసఫ్‌జాహీ వంశస్థులు, మజ్లి్‌స్-ఎ-సాహెబ్‌ జాదాగన్‌ సొసైటీ సభ్యులు, నిజాం కుటుంబీకులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయాలపై కనీస అవగాహన లేని అజ్మత్‌కు వారసత్వ బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. నిజాం ట్రస్టీల్లో ఒక్కరినీ సంప్రదించకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. లండన్‌లో పుట్టి పెరిగిన అజ్మత్‌కు నిజాం కుటుంబీకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ‘16 ట్రస్టుల్లోని 4,500 మంది సభ్యులంతా కలిసి.. నవాబ్‌ రౌనఖ్‌యార్‌ఖాన్‌ను తొమ్మిదో నిజాంగా ఎంపిక చేశాం. రౌనఖ్‌ ప్రమాణస్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం. మా నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి, వారికి పరిస్థితులను వివరించాం’ అని చెప్పారు.