Drugs in Narsingi: నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ తో పట్టుబడ్డ యువతి విజయవాడ నుంచి ఉన్నత చదువులు కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య అని వివరించారు. నటనపై మక్కువతో టాలీవుడ్ లో ఛాన్సుల కోసం లావణ్య ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మ్యూజిక్ టీచర్ గా పని చేస్తూ చిన్న సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. లావణ్య పలు చిన్న సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినట్లు తెలిపారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఆమె జల్సాలకు అలవాటు పడ్డట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. నటనా రంగంలో ఉండడంతో ఒక హీరోకు పరిచయమై అతనికి లవర్ గా కూడా ఉంది. 


వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు లో కూడా లావణ్య అనుమానితురాలుగా ఉన్నట్లు పోలీసులు వివరించారు. గత కొంత కాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకుంటుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. మరోవైపు, లావణ్య సోషల్ మీడియా అకౌంట్ లతో పాటు వ్యక్తిగత చాట్ ని కూడా పోలీసులు పరిశీలించనున్నారు. ఆమెకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి  తీసుకుంటామని పోలీసులు వివరించారు.


హైదరాబాద్ అడ్డాగా మరోసారి డ్రగ్స్‌ దందా గుట్టురట్టయింది. నార్సింగిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో ఓ యువతి డ్రగ్స్ తో దొరికింది. లావణ్య అనే యువతి వద్ద నాలుగు గ్రాముల డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి టాలీవుడ్ యంగ్ హీరో ప్రేయసి అని పోలీసులకు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే కేసులో మరో యువకుడ్ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్యకు రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. 


సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నార్సింగీలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. దాంతో SOT పోలీసుల టీమ్ అక్కడికి చేరుకుని ఓ యువకుడు, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఓ యువకుడి వద్ద నుంచి ఆ యువతి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిన యువతి టాలీవుడ్ యంగ్ హీరో ప్రేయసి అనే విషయం హాట్ టాపిక్ అవుతోంది. కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ప్రేయసి డ్రగ్స్ కేసులో దొరకడం సంచలనంగా మారింది.