Telangana High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్‌లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణకు రాగా.. యథాతథంగా కొనసాగించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి హైకోర్టు వాయిదా వేసింది.


ఎదురుచూపులు.. 
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం, అమెర్ అలీఖాన్ పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ అగౌరవాన్ని ప్రదర్శించారు. ప్రమాణస్వీకారం కోసం సభ్యులు వచ్చినా కూడా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం తన చాంబర్ కు చేరుకోలేదు. దీంతో గంటల తరబడి వారిద్దరూ ఆయన కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. కేసీఆర్ ఆదేశాలతోనే గుత్తా ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


అందుకే రాలేకపోయా - గుత్తా సుఖేందర్
మండలికి రాకపోవడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. గత కొన్ని రోజుల నుండి తాను గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నానని అన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్సపొందుతున్నానని అన్నారు. అనారోగ్యంతో ఉండటం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ “ఎట్ హోం” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని అన్నారు.