హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రెవెన్యూ రాబడులు రూ.1 లక్ష కోట్ల మార్కు చేరాయి. నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ఖజానాకు చేరిన పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం సహా గ్రాంట్ల మొత్తం రూ.1.03 లక్షల కోట్లు అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలలు గడిచినప్పటికీ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో సగానికి కూడా చేరుకోలేదు. నవంబర్ నెల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.1.38 లక్షల కోట్లకుపైగా ఉంది. అందుకు తగ్గట్లుగా ఆదాయం లేకపోవడంతో రెవెన్యూ లోటు భారీగానే నమోదవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ఆదాయం అధోగతి, ఖజానాకు భారీగా తగ్గిన రాబడి అని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ఆదాయం, వ్యయాల లెక్కలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై అస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ఆదాయంలో క్షీణత కనిపించింది. గత ఏడాదితో పోల్చితే రూ.7వేల కోట్లు తగ్గింది. 2023తో పోల్చితే 2024-25లో 7 శాతం ఆదాయం తగ్గడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు. కరోనా కొవిడ్ కష్టకాలంలోనూ ఆదాయ వృద్ధి నమోదు చేశాం, చేతకాని కాంగ్రెస్ పాలనతో రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదని లెక్కలు తేల్చాయని సెటైర్లు వేస్తున్నారు.
2023లో నవంబర్ నాటికి తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు రూ.1,11,141.37 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో రూ.7,841.33 కోట్లు తగ్గింది. గత ఏడాది కన్నా 7.05 శాతం తగ్గుదల నమోదు కావడం తెలంగాణ చరిత్రలో తొలిసారి అని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ మండిపడుతోంది. కరోనా సమయంలో 2020-21లో ఆదాయం పడిపోయింది. అది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. కానీ ఆ మరుసటి ఏడాదే కోలుకుని ఆదాయం వచ్చేలా చేశాం. ఐదేండ్ల తర్వాత తొలిసారి తెలంగాణ ఆదాయం తిరోగమనంలో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే లక్షన్నర కోట్ల అప్పులు చేసింది. అవి చాలవన్నట్లు ఏకంగా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి 10 వేల కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ విమర్శించింది. కొత్త ప్రాజెక్టుకులు చేపట్టకున్నా, రాష్ట్ర అప్పులు మాత్రం భారీగా పెరుగుతున్నాయని కేటీఆర్, హరీష్ రావు పలుమార్లు ఆరోపించారు.