చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ ఘాట్​ దగ్గర బీఆర్​ఎస్​ సీనియర్​ నేత మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర  నివాళులు అర్పించి దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష కొనసాగిస్తానని అంటున్నారు మోత్కుపల్లి. అయితే పోలీసులు మాత్రం గంటల వరకే అనుమతి  ఉందని తేల్చిచెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనే అవకాశం కనపిస్తోంది.


చంద్రబాబు ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారంటూ ప్రశ్నించారు మోత్కుపల్లి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అయన్ను అరెస్ట్‌ చేశారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌  స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు మోత్కుపల్లి. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు కూడా లేదని... అలాంటప్పుడు ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు.  సీఎం జగన్‌ దుర్మార్గుడంటూ ఫైరయ్యారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయాలంటే... 17A ప్రకారం గవర్నర్‌ అనుమతి ఉండాలన్నారు. గవర్నర్‌ అనుమతి  తీసుకోకుండానే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు.


ప్రజల కోసం 8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు అని అన్నారు. అలాంటి వ్యక్తి 300 కోట్లకు  ఆశపడతారా అంటూ ప్రశ్నించారు మోత్కుపల్లి. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్​ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. జైలులో చంద్రబాబుకు ఏమైనా  జరిగితే.. పూర్తి బాధ్యత జగన్​దేనని హెచ్చరించారు మోత్కుపల్లి నర్సింహులు. అలాగే సీఎం కేసీఆర్​ రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని కోరారు.   రాజమండ్రికి వెళ్లి భువనేశ్వరిని పరామర్శిస్తానని.. అవకాశం ఉంటే చంద్రబాబును ములాఖత్‌లో కలుస్తానని చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దుర్మార్గాలు పెరిగిపోయాయని, జనం నవ్వుకుంటున్నారని అన్నారు. గతంలో డాక్టర్‌ సుధాకర్‌ విషయంలోనూ దారుణంగా వ్యవహరించారని  మండిపడ్డారు మోత్కుపల్లి. సీఎం జగన్‌ సర్కార్‌ ప్రతిపక్షాలను టార్గెట్‌ చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌ అన్యాయమంటూ మోత్కుపల్లి ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర నిరసన  దీక్ష చేస్తున్నారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని మోత్కుపల్లి చెప్తున్నా... పోలీసులు మాత్రం గంట మాత్రమే సమయం ఇస్తామని చెప్పడంతో టెన్షన్‌ వాతావరణం  కొనసాగుతోంది. 


మరోవైపు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబును రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే  ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారమే విచారణను కొనసాగిస్తున్నారు. ఇక, క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌  చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. రేపు సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌పై విచారణ జరిపే అవకాశం ఉంది.  స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు  రిమాండ్‌ను, ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని అత్యున్నత ధర్మాసనంలో క్వాష్‌ పిటిషన్‌ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు.