Hyderabad Crime News: వ్యవసాయ భూములపై కోట్ల రూపాయల రుణం ఇస్తామని నమ్మించారు. ఈక్రమంలోనే ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో దాదాపు రూ.2 కోట్లకు పైగా తీసుకున్నారు. అనంతరం చెప్పాపెట్టకుండా కంపెనీ మూసేశారు. బోర్డు తిప్పేసి కోట్లు దండుకొని పరారయ్యారు. అయితే మోసపోయినట్లు గుర్తించిన ఓ బాధితుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్ కోంపల్లిలో నివసిస్తున్నాడు. బషీర్ బాగ్ లోని బాబుఖాన్ ఎస్టేట్ నాలుగో అంతస్తులో ఫ్లాట్ నెంబర్ 407ను అద్దెకు తీసుకున్నాడు. అక్కడే కుబేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వ్యవసాయ భూములపై తక్కువ వడ్డీకి, ఎలాంటి ష్యూరిటీ లేకుుండానే రుణాలు ఇస్తామని చెప్పుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ కూడా రూపొందించుకొని దేశ వ్యాప్తంగా 28 శాఖలు ఉన్నట్లు, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కూడా ఉన్నట్లు తెలిపాడు. 


రుణాలు పొందాలనుకున్న వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..


దీంతో చాలా మంది అమాయక ప్రజలు అతడి వద్ద రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. ముందుగా ఐదు వేల రూపాయలి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయింకోవాలని, దరఖాస్తు నింపి కావాల్సిన రుణం గురించి వివరించాలని సూచించాడు. అంతేకాకుండా రుణం తీసుకునే వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, వంటగ్యాస్ రశీదు జత చేయాలని వివరించాడు. ఆ తర్వాత సీఏ రిపోర్టు, ఇతర పత్రాలు, ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఒక్కకొక్కరి వద్ద నుంచి 25, 30 వేల రూపాయలు వసూలు చేశాడు. కొందరు అధిక రుణం కోసం లక్ష నుంచి 4 లక్షలకు పైగా చెల్లించారు. బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ, ఐడీబీఐ బ్యాంక్ ల ద్వారా రుణాలు వస్తాయని వారిని నమ్మించాడు. అయితే అందినకాడికి దోచుకొని కంపెనీ బోర్డు తిప్పేసినట్లు తెలియని ఓ వ్యక్తి రెండు లక్షల రూపాయలు తీసుకు రావడం గమనార్హం. 


700 నుంచి 800 ఫైళ్లకు నిప్పు పెట్టి, సీసీ కెమెరాలు ధ్వంసం


అయితే కుబేర్ ఫైనాస్షియల్ సర్వీసెస్ సంస్థ పని తీరుపై అనుమానం వచ్చి బాబుఖాన్ ఎస్టేట్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి వేణు మాధవ్ ఈనెల 21వ తేదీన సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు గత కొద్ది రోజులుగా అమిత్ కుమార్ ను ప్రశ్నిస్తుండగా.. సెప్టెంబర్ 26వ తేదీ నాటికి రుణాలకు సంబంధించిన చెక్కులు ఇస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి పంపించి దరఖాస్తులు, అగ్రిమెంట్లు తదితర 700 నుంచి 800 ఫైళ్లకు నిప్పు పెట్టారు. సీసీ కెమెరాలు విరగ్గొట్టి ఆధారాలు లేకుండా చేశారని బాధితులు వాపోయారు. శనివారం ఉదయం వచ్చిన కొందరు బాధితులు కార్యాలయంలోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. మరికొందరు ఏసీలు, కంప్యూటర్లు తీసుకెళ్లారు.


Read Also: Delivery Boy: పేషెంట్‌గా మారిన డెలివరీ బాయ్, డాక్టర్‌ను కత్తితో బెదిరించి దోపిడీ - ట్విస్ట్ ఏంటంటే!