Delivery Boy: వైద్యుడిని కత్తితో బెదిరించి దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని పెద్దర్ రోడ్ ప్రాంతంలో 70 ఏళ్ల వైద్యుడిని 23 ఏళ్ల డెలివరీ బాయ్ దోపిడీ చేశాడు. పేషెంట్ గా నటించి ఆస్పత్రిలోకి వచ్చిన డెలివరీ బాయ్.. డాక్టర్ తనను పరీక్షించగానే.. సంచిలో నుంచి కత్తి తీసి బెదిరించి దోపిడీ చేశాడు. డాక్టర్ వద్ద ఉన్న బంగారం, డబ్బును దోచుకెళ్లాడు. ఈ దోపిడీపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. వారు చాకచక్యంగా దొంగను అరెస్టు చేశారు. నిందితుడు యూపీకి చెందిన అర్జున్ సోంకర్ గా గుర్తించారు.


యుపీకి చెందిన అర్జున్ సోంకర్.. ముంబయిలోని వర్లీలో నివాసం ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఈ ఏడాది మే నుంచి స్విగ్గీలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా సోంకర్ రోగిలా నటిస్తూ.. డాక్టర్ మందాకిని పిరంకర్ క్లినిక్ కి వెళ్లి దోపిడీకి పాల్పడ్డాడు. పిరంకర్ గత 25 సంవత్సరాలుగా తన భాగస్వామి అయిన మరో మహిళా డాక్టర్ తో కలిసి క్లినిక్ ని నిర్వహిస్తున్నారు. అర్జున్ సోంకర్.. తనను తాను అవినాష్ పాశ్వాన్ అని డాక్టర్ వద్ద పరిచయం చేసుకున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి క్లినిక్ కు వచ్చాడు. సోంకర్ ను పరీక్షించిన డాక్టర్.. తనకు లోబీపీ ఉన్నట్లు నిర్ధారించారు. అతడిని ఆస్పత్రిలో చేరాలని సూచిస్తూ రిఫరెన్స్ నోట్ రాసిచ్చారు. అర్జున్ సోంకర్ డాక్టర్ ఫీజు రూ.200 చెల్లించి బయటకు వెళ్లాడు.


కాసేపట్లోనే తిరిగి వచ్చిన సోంకర్.. వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి కత్తిని తీసి డాక్టర్ గొంతుపై పెట్టి, చప్పుడు చేయవద్దని బెదిరించాడు. డాక్టర్ వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన బంగారు గొలుసు, లాకెట్ ను తీసుకున్నాడు. వాటిని తీసుకుని పారిపోయే ముందు ఆమెను తోసేశాడు. 


నిందితుడు అర్జున్ సోంకర్.. తన బ్యాగ్ ను, డైరీలో చేతితో రాసిన ఓ నోట్ ను వదిలేసి పారిపోయాడు. ఆ నోట్ లో సారీ అని రాసి ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అతడి ఉద్దేశం కేవలం దోచుకోవడమేనని, డాక్టర్ పై దాడి చేయడం కాదని పోలీసులు తెలిపారు. సోంకర్ పారిపోయే ముందు డాక్టర్ క్యాబిన్ లో స్విగ్గీ టీషర్టు కూడా మర్చిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని కాసేపట్లోనే అర్జున్ సోంకర్ ను పట్టుకున్నారు. అయితే అర్జున్ ను దొంగతనానికి పాల్పడటం ఇదే తొలిసారి అని, గతంలో అతడిపై ఎలాంటి నేరాభియోగాలు లేవని పోలీసులు గుర్తించారు. అతడు వర్లీలో భార్యతో కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. డాక్టర్ వద్ద దోచుకెల్లిన గొలుసును, లాకెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు. అతని వద్ద 16 వేల రూపాయల నగదును మాత్రమే పట్టుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి శ్రీనివాస్ దారాడే తెలిపారు. అర్జున్ సోంకర్ ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దోపిడీ సమయంలో అర్జున్ సోంకర్ కత్తితో బెదిరించినప్పుడు డాక్టర్ కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.