Hyderabad Latest News: అమ్మలకు కోపం వస్తోంది. అగ్నిపర్వతాన్నైనా తన ఓపికతో కూల్ చేసే అమ్మకు కోపం వస్తే ఏం జరుగుతుందో చూపించారు ఇద్దరు తల్లులు. బిడ్డలు కడుపులో పడినప్పటి నుంచి తన గురించి మర్చిపోయే వారే సర్వస్వమై బతుకుంది తల్లి. అలాంటి తల్లిని పట్టించుకోని బిడ్డలు ఉన్నా లేనట్టే లెక్క. నేటి కూడా చాలా మంది ఇదే నిర్లక్ష్యంతో ఉంటున్నారు. వాళ్లు ఇచ్చిన ఆస్తులు ఆనుభవిస్తున్నారే తప్ప తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోవడం లేదు. అలాంటి కుమారులకు గట్టి గుణపాఠం నేర్పిందో తల్లి.

హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌కు సమీపంలోని ఉంది మూసారాంబాగ్‌. ఆ ప్రాంతంలో ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటోంది శకుంతులా బాయి. వయసు 90 ఏళ్లు. ఆమెకు ఆరుగురు సంతానం, ఇందులో ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. 

భర్త చనిపోయినప్పటి నుంచి తన ఇంట్లో కుమారులతో కలిసి ఉంటోంది. చాలా కాలం నుంచి కుమారులు సరిగా చూసుకోవడం లేదు. ఆరోగ్య సమస్యలు వచ్చినా పట్టించుకోవడం లేదు. తమకు భారంగా భావిస్తున్నారు. అయినా సరే అన్నింటినీ భరిస్తూ వచ్చింది. కానీ ఒక రోజు ఇంటి నుంచి శకుంతులా బాయిని బయటకు గెంటేశారు. 

కట్టుబట్టలతో రోడ్డున పడ్డ తల్లిని చిన్న కుమార్తె ఆదరించింది. సైదాబాద్‌లోని తన ఇంటికి తీసుకెళ్లింది. కొన్ని రోజుల తర్వాత కుమారులు వస్తారు తీసుకెళ్తారని చూసింది. కానీ ఎవరూ రాలేదు. అంతే తనను చిత్రవధ చేసి బయటకు గెంటేయడమే కాకుండా తన ఆస్తులు అనుభవిస్తున్నారని ఆగ్రహంతో కీలక నిర్ణయం తీసుకుంది. 

కుమారులకు బుద్ధి చెప్పాలని అనుకొని స్థానికంగా ఉండే సీనియర్‌ సిటిజెన్స్‌ అసోషియేషన్‌ ప్రతినిధులను సంప్రదించింది. వారికి తన బాధను చెప్పుకుంది 90 ఏళ్లలో ఆ తల్లి పడుతున్న ఆవేదన అర్థంచేసుకున్న అసోసియేషన్ ప్రతినిధులు విషయాన్ని హైదరాబాద్‌ జిల్లా ఆర్‌డీఓకు చేరవేశారు. అధికారులు 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు తీసుకున్నారు. 

తల్లి ఫిర్యాదుతో కుమారులకు నోటీసులు జారీ చేశారు. ఇద్దర్నీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అధికారుల జోక్యంతో ఇంటిని ఇచ్చేందుకు ఓకే చెప్పారు. నెలలు గడుస్తున్నా వారు చెప్పిన పని చేయలేదు. దీంతో ఆ తల్లి మరోసారి ఆర్‌డీఓను ఆశ్రయించారు. తన గోడు వెల్లబోసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్డీవో సైదాబాద్‌ తహసీల్దార్‌ జయశ్రీకి కీలక సూచనలు చేశారు. 

తహసీల్దార్ రంగ ప్రవేశం చేసి కుమారులకు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కుమారులు స్పందించలేదు. చివరకు అధికారులు వైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇంటిని అప్పగించకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో  ఇంటిని ఖాళీ చేసి ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు కుమారులు. గురువారం అధికారులు ఆ ఇంటికి వెళ్లి తాళాలు వేశారు. ప్రక్రియ పూర్తైన తర్వాత శకుంతులా బాయికి అప్పగిస్తామంటున్నారు అధికారులు.  

జమ్మలమడుగులో ఇల్లు స్వాధీనం 

కర్నూలు జిల్లా జమ్మలమడుగులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. తనను పట్టించుకోని కుమార్తెల నుంచి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు తల్లదండ్రులు. దీనికి కూడా అధికారులు సహకరించారు. ఆ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి . ఈ విషయంలో తల్లి మనకెందుకులే అని అనుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆమె తన బిడ్డలపై పూర్తి ఆగ్రహంతో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.