Telangana CM Revanth Reddy: మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే సెలబ్రిటీలతో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు కూడా డ్రగ్స్‌కు అ‌డ్డాగా మారుతున్న వేళ ఆయా సంస్థలను కూడా ఈ డ్రగ్స్‌ నిర్మూలన ఉద్యమంలో భాగం చేయాలని చూస్తోంది. ఇకపై ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో డ్రగ్స్ లభిస్తే మాత్రం యాజమాన్యంపై కేసులు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎలాంటి కార్యక్రమమైనా ముందుకు సాగదు. అందుకే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సాగుతున్న పోరులో ప్రజలను, ప్రజలతో సంబంధం ఉన్న వారందర్నీ కలుపుకొని వెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సినిమా సెలబ్రిటీలను ఆదేశించి ప్రభుత్వం. ఈ ఆదేశాల మేరకు సినిమా విడుదల సందర్భంగా ఆయా నిర్మాణ సంస్థలు, నటీనటులు వీడియోలు చేసి తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో పెడుతున్నారు. ఈ ఉద్యమంలో విద్యాసంస్థలను కూడా అదే మాదిరిగా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. 

డ్రగ్స్ బారిన పడుతున్న వారి సినారియో చూస్తే వాళ్లకు కాలేజీ సమయంలోనో, స్కూల్‌ డేస్‌లో ఎవరో పరిచయం చేస్తున్నారు. అలా వారీ రొంపిలో పడిపోతున్నారు. అందుకే ఇప్పుడు డ్రగ్స్‌ వ్యతిరేక ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్స వేదికపై నుంచి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యాసంస్థల్లో డ్రగ్స్ చిక్కితే ఆ సంస్థ యాజమాన్యాన్ని కూడా నిందితుల జాబితాలో చేర్చాలని ఆదేశించారు. 

ఉన్నత విద్య పూర్తి అయ్యే వరకు పిల్లలు ఎక్కువగా ఉండేది విద్యాసంస్థల్లోనే. ఎంతో నమ్మకంతో విద్యార్థులు తమ పిల్లలను కాలేజీలకు స్కూళ్లకు పంపిస్తారు. కానీ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలు వారి బాగోగులు కూడా పట్టించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చదువు చెప్పడంతోనే వారి బాధ్యత అయిపోదని విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పులు ఇతర విషయాలను కూడా గమనించాలని సూచించారు. ఇలాంటి వాటి కోసం ప్రతి విద్యాసంస్థ కూడా మానసిక నిపుణులను నియమించుకోవాలని తెలిపారు.      

దేశం పురోభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా యువకులదే కీలక పాత్ర అని అన్నారు. అలాంటి యువత డ్రగ్స్ బారిన పడి బానిసలుగా మారితే భవిష్యత్ ప్రమాదకరంగా తయారవుతుందని అన్నారు. దీనికి పునాది విద్యాసంస్థల్లో పడుతోందని అందుకే కఠినంగా ఉంటే తప్ప ఈ మహమ్మారిని కట్టడి చేయలేమన్నారు. పిల్లలు డ్రగ్స్‌కు బానిసలవుతుంటే చూస్తూ ఊరుకోలేమని చెప్పారు. ఇకపై విద్యాసంస్థల్లో డ్రగ్స్ చర్యలు ఉంటే మాత్రం యాజమాన్యులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. చుట్టుపక్కల అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధత్యత వాళ్లదేనన్నారు. విద్యాసంస్థల చుట్టుపక్కల ఉండే షాపుల్లో, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు లేదా 1908కి సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సీఎం పిలుపునిచ్చారు.