Jammalamadugu Latest News: ఆస్తులు చేతికి వచ్చే వరకు అమ్మానాన్న ఆస్తులు చేతికి వచ్చిన తర్వాత మూసలోళ్లు చేతకాని వాళ్లు అయిపోతున్నారు. వృద్ధాప్యంలో వారిని సరిగా చూసుకోవాల్సిన బిడ్డలు పట్టించుకోని ఘటనలు చాలా చూశాం. అలాంటి బిడ్డలకు గట్టిగా బుద్ధి చెప్పారు జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ. ఆస్తులు ఉన్నా లేకపోయినా కన్నవాళ్లను చూసుకోవడం పిల్లల బాధ్యత అని చెప్పుకొచ్చారామె. 

ప్రొద్దు­టూ­రుకు చెందిన మాలేపాటి మోహ­న్‌­రావు, గౌరమ్మ దంపతులు ఏదో చిన్న వ్యాపారం చేసి డబ్బులు కూడబెట్టారు. ఐదుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. వయోభారంతో వ్యాపారం సాగడం లేదు. దీంతో దాన్ని ఆపేశారు. తమను సాకుతారన్న ఆశతో రంగయ్యగారి సత్రంవీధిలో ఉన్న ఇంటిని ఏడాది క్రితం పిల్లలకు రాసి ఇచ్చేశారు. ఈ మేరకు గిఫ్ట్‌ డీడ్ రాసి ఉంచారు. 

ఆస్తి తమ చేతికి రావడంతో కుమార్తెలు తమ నిజస్వరూపం చూపించారు. తమ పేరు మీద ఆస్తి వచ్చేసరికి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు. తిండి కూడా పెట్టడం లేదు. వాళ్ల అనారోగ్య సమస్యలకు మందులు కూడా ఇవ్వకుండా హింసించారు. వేరే గత్యంతరం లేకపోవడంతో ఆ ముసలిదంపతులు స్వచ్ఛంద సంస్థలు, ఇరుగుపొరుగువారి సహాయంపై ఆధారపడ్డారు. వాళ్లు వేస్తే తినడం లేదంటే పస్తులు ఉంటున్నారు. 

ఇలా ఎన్నిరోజులు ఇబ్బంది పడటమో అర్థం కాకపోవడంతో ఆ దంపతులు ఇద్దరూ కొన్ని రోజుల క్రితం వృద్ధాశ్రమంలో చేరారు. అక్కడ చేరిన తర్వాత పిల్లలు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. కనీసం ఎలా ఉన్నారనే ధ్యాస కూడ లేకుండాపోయింది. ఎన్ని రకాలుగా విషయానని చేరవేసినా బిడ్డల ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కొందరి సలహా మేరకు ఉన్నతాధికారులను ఆశ్రయించారు మోహన్‌రావు, గౌరమ్మ దంపతులు. స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడి విషయాన్ని ఆర్డీవోకు చేరవేశారు. 

మోహన్‌రావు, గౌరమ్మ దంపతులు విషాద గాథను విన్న ఆర్డీవో సాయిశ్రీ వెంటనే స్పందించారు. ఈ దంపతులతోపాటు వారి కుమార్తెలకు నోటీసులు జారీ చేశారు. అయినా వాళ్లు రాలేదు. ఫిబ్రవరి 22,మార్చి 12, 29, ఏప్రిల్‌ 19వ తేదీల్లో విచారణ జరిపారు. ఏ విచారణకి కూడా ఐదుగురు కుమార్తెల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు.  

మోహన్‌రావు, గౌరమ్మ దంపతులపై తమ బిడ్డలకు ఏ మాత్రం ప్రేమ ఉందో తెలుసుకున్నారు అర్డీవో. వాళ్లను సరిగా చూసుకున్న ఆధారాలు కూడా లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.  కుమార్తెలకు ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. తిరిగి ఆ ఇల్లు మోహన్‌రావు, గౌరమ్మ దంపతులకు దక్కేలా ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆ పత్రాలను ఆ వృద్ధ దంపతులకు ఇచ్చారు.