Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఫ్లైఓవర్‌కు సంబంధించిన డిజైన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇలాంటి విచిత్రమైన డిజైన్‌తో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ ఒకటి వైరల్ అయ్యింది. దాన్ని అధికారులు రీడిజైన్ చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు నెటిజన్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న టెంపుల్‌ రన్ స్టైల్‌ ఫ్లైఓవర్‌ను వైరల్ చేస్తున్నారు. భోపాల్‌ బ్రిడ్జి కంటే మరింత దారుణంగా ఈ డిజైన్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండ సమీపంలోని వెంకట్‌రెడ్డిపల్లె అనే ప్రాంతంలో కేంద్రం ఫ్లైఓవర్‌ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన విచిత్రమైన డిజైన్‌ను నెటిజన్లు Xలో పోస్టు చేశారు. ఈ ఫ్లైఓవర్‌లో మూడు చోట్ల 90 డిగ్రీల షార్ప్ టర్న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాహనాలు ఆ ఫ్లైఓవర్‌పై ట్రావెల్ చేస్తే వరుసగా మూడు సందర్భాల్లో కుడివైపు లేదా ఎడమవైపు షార్ప్‌గా తిరగాల్సి ఉంటుంది.

ఈ విచిత్రమైన డిజైన్‌ ఎలా ఉందో వివరిస్తూ @Austin Shivaji Kumar అనే వ్యక్తి గూగుల్‌లో వివరిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఫ్లైఓవర్‌పై వ్యంగ్యంగా స్పందించింది. “భోపాల్ 90° ఫ్లైఓవర్‌ని తయారు చేసింది. ఆంధ్ర: ‘నా చాయ్ పట్టుకో’ అని చెప్పింది” అని ఒక పోస్ట్ పెట్టింది. NH 57 నుంచి ఫ్లైఓవర్‌పైకి వెళ్లే దారి కూడా 90 డిగ్రీల టర్న్‌తోనే ఉంది. ఈ ఫ్లైఓవర్‌కు సమీపంలో అంజనేయస్వామి దేవాలయం ఉంది.

సోషల్ మీడియా యూజర్లు ఈ ఫ్లైఓవర్‌ను “టెంపుల్ రన్, భోపాల్ వెర్షన్” అని సెటైర్లు పేలుస్తున్నారు. ఆస్టిన్ శివాజీ కుమార్ కామెంట్ చేస్తూ “NH 57 నుంచి వెళ్లే ఎంట్రీ కూడా 90 డిగ్రీల టర్న్‌తోనే ఉంది. లోకల్‌ ట్రాఫిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ తక్కువగా ఉన్నప్పటికీ, ఈ బ్రిడ్జ్‌పై వెళ్ళిన వారు ఒక కొత్త, ప్రో మాక్స్ డ్రైవింగ్ స్కిల్ నేర్చుకోవచ్చు” అని అన్నారు.  

ఇటీవలే భోపాల్ రైల్ ఓవర్‌బ్రిడ్జ్‌పై ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఆ బ్రిడ్జ్‌లో ఒక చోట 90 డిగ్రీల ఎల్-షేప్ టర్న్ ఉంది. ఇది “అయోమయానికి చిహ్నం” అని కామెంట్ చేశారు. ఈ డిజైన్‌లో లోపాలు ప్రమాదాలకు దారి తీస్తాయని అన్నారు. ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఈ బ్రిడ్జ్‌ను టార్గెట్ పెట్టుకున్నారు. కానీ లోపాలు కారణంగా నేటికీ ఆ బ్రిడ్జ్‌ పూర్తి కాలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేని కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. జరిగిన లోపాన్ని గుర్తించిన అధికారులు ఆ బ్రిడ్జ్‌ను రీడిజైన్ చేసేందుకు అంగీకరించింది. ఇప్పుడు అలాంటి ఫ్లైఓవర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఉందని నెటిజన్లు ప్రభుత్వానికి చూపిస్తున్నారు. ఈ విచిత్రమైన టర్న్‌లు అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్‌లోని లోపాలపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయని అంటున్నారు. 

ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకే ఈ రెండు ప్రాజెక్టులూ రూపొందించారు. కానీ డిజైన్ లోపాలు కారణంగా నాణ్యత, ఇతర అంశాలపై విమర్శలు రావడం మొదలయ్యాయి.